నామకరణం చేసేలోపే అనంత లోకాలకు

20 Sep, 2019 08:09 IST|Sakshi
మృతి చెందిన చిన్నారి, తల్లిదండ్రులు సాయిబాబా, లావణ్య

టీకా వికటించి చిన్నారి మృతి

మల్కాజిగిరి: ఇరవై నాలుగు గంటలు గడిస్తే ఆ ఇంట్లో పండగ వాతావరణం.. అంతలోనే ఆ చిన్నారిని టీకా మందు పొట్టన పెట్టుకొంది. టీకా వల్లనే తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులు, బాధితుల కథనం మేరకు.. మల్కాజిగిరి సాయినగర్‌కు చెందిన సాయిబాబా, లావణ్య భార్యాభర్తలు. సాయిబాబా కూలి పనులు చేస్తుండగా.. లావణ్య వారు ఉంటున అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా ఉంటోంది. వీరికి రెండేళ్ల భానుశ్రీతో పాటు ఈ ఏడాది జూలై 15న మరో మగబిడ్డ పుట్టాడు. శుక్రవారం ఆ బాలుడికి నామకరణం మహోత్సం చేయాలని నిశ్చయించారు. అయితే, బుధవారం నర్సింహారెడ్డినగర్‌ కమ్యూనిటీ హాల్‌లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి పంపిణీ చేసిన టీకాలను ఎఎన్‌ఎంలు పిల్లలకు వేశారు.

ఈ క్రమంలో సాయిబాబా బిడ్డకు కూడా టీకా వేయించారు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కొద్దిగా జ్వరం ఉండంతో పాటు టీకాలు వేసిన ప్రాంతంలో వాపు తగ్గడానికి ఐస్‌ప్యాక్‌ పెట్టమని చెప్పడంతో చిన్నారి తల్లితండ్రులు అలాగే చేశారు. గురువారం ఉదయం చూసేసరికి టీకాలు వేసిన ప్రాంతంలో కమిలిపోయి ఉండంతో పాటు చిన్నారిలో స్పందన లేకపోయింది. దీంతో వెంటనే స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వారు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యులకు చూపించగా అప్పటికే బిడ్డ మృతి చెందాడని చెప్పడంతో గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు బాలుడి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, చిన్నారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు.

నేడు నామకరణం.. అంతలోనే మరణం
మొదట పాప పుట్టిన రెండేళ్లకు బాబు పుట్టడంతో సంతోషంగా ఉన్నామని సాయిబాబా, లావణ్య కన్నీటి పర్యంతమయ్యారు. ఎల్లమ్మ దేవతకు మొక్కుకున్నామని శుక్రవారం మంచిరోజు ఉందని చెప్పడంతో ఆ తల్లి పేరు వచ్చేలా ‘యశ్వానంద్‌కుమార్‌’ అని పేరు కూడా పెట్టాలని బంధువులను పిలుచుకున్నామన్నారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని రోదించారు. పాప, బాబు ఉండడంతో లావణ్య కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కూడా చేయించుకుందని బంధువులు తెలిపారు.

మరిన్ని వార్తలు