పిల్లల్ని ఎత్తుకెళ్లేవారనే అనుమానంతో..

1 Jul, 2018 19:33 IST|Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ధూలే జిల్లాలోని ఓ గ్రామంలో పిల్లల్ని ఎత్తుకెళ్లే వారనే అనుమానంతో గ్రామస్తులు ఐదుగురు వ్యక్తులను కొట్టిచంపారు. గిరిజన గూడెం రైన్‌పాదలో రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ బస్సులో దిగిన ఐదుగుని స్ధానికులు చితకబాదారు. ఓ బాలికతో మాట్లాడేందుకు వారు ప్రయత్నించగా, పిల్లల్ని ఎత్తుకుపోయే బృందంగా అనుమానిస్తూ అక్కడ గుమికూడిన గ్రామస్తులు వారిపై దాడికి తెగబడ్డారని పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో పిల్లల్ని ఎత్తుకెళ్లేవారు తిరుగుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో గ్రామస్తులు వారిని చితకబాదడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారని తెలిపారు.

మృతదేహాలను సమీప పింపల్నేర్‌ ఆస్పత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఈ తరహా ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. నాలుగు రోజుల కిందట గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పిల్లల్ని ఎత్తుకువెళుతుందనే అనుమానంతో ఓ యాచకురాలిని కొట్టిచంపారు. బాధితురాలిని సర్ధార్‌నగర్‌కు చెందిన శాంతాదేవిగా గుర్తించారు. ఇదే ఘటనలో అశుదేవి నాథ్‌, లీలాదేవి నాథ్‌, అనసి నాథ్‌లకు గాయాలయ్యాయి.

అహ్మదాబాద్‌లోని వదాజ్‌ ప్రాంతం మీదుగా బాధితులు ఆటోలో వెళుతుండగా స్ధానికులు వారిని అటకాయించి దాడికి పాల్పడ్డారు. మరోవైపు గత వారం చత్తీస్‌గఢ్‌లో పిల్లల్ని ఎత్తుకువెళతాడని అనుమానిస్తూ ఓ వ్యక్తిని చావబాదారు.

మరిన్ని వార్తలు