కత్తి మహేష్‌పై ఫిర్యాదులు

1 Jul, 2018 20:33 IST|Sakshi
కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని అమలాపురం పట్టణ సీఐ శ్రీరామ కోటేశ్వరరావుకు ఫిర్యాదు చేస్తున్న ఆజాద్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు


సాక్షి, అమలాపురం: రామయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆజాద్‌ ఫౌండేషన్‌ కోరింది. ఓ వార్తా చానల్‌ చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఆదివారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆ ఫౌండేషన్‌ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును పట్టణ సీఐ సీహెచ్‌ శ్రీరామ కోటేశ్వరరావుకు అందజేశారు.

న్యూస్‌ ఛానల్‌ డిబేట్‌లో కత్తి మహేష్‌ మాట్లాడుతూ.. ‘రామాయణం నాకొక కథ మాత్రమే. రాముడు దగుల్భాజీ అని నేను నమ్ముతా. ఆ కథలో సీత రావణుడితో ఉంటేనే న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అజాద్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు యల్లమిల్లి నాగసుధా కొండ తెలిపారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌పైన, ఇలాంటి పనికి రాని చర్చలు పెట్టి మతాలు, కులాల, సామాజిక వర్గాలను రెచ్చ గొట్టేలా ప్రసారాలు చేసే ఆ టీవీ ఛానల్‌ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని ఫౌండేషన్‌ ప్రతినిధులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించి కత్తి మహేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమజానికి ఎంత మాత్రం ప్రయోజనం లేని అలాంటి డిబేట్‌లను ఇప్పటికైనా నిలిపివేసి సమాజ హితమైన అంశాలను ప్రసారం చేయాలని ఫౌండేషన్‌ ప్రతినిధులు ఆ టీవీ ఛానల్‌కు విజ్ఞప్తి చేశారు. కత్తి మహేష్‌పై చర్యలు తీసుకునే వరకూ తమ ఫౌండేషన్‌ ద్వారా ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు బసవా సత్య సంతోష్, మహదేవ నాగేశ్వరరావు, జొన్నాడ దుర్గారావు, ఇవాని శర్మ, కొత్తపల్లి వంశీ, కొండేపూడి ప్రకాష్, బొక్కా నాని తదితరులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

హైదరాబాద్‌లోనూ ఫిర్యాదు
కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ జనశక్తి నేతలు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆయనపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు