రిక‘వర్రీ’!

1 Mar, 2019 11:21 IST|Sakshi

నైజీరియన్‌ సైబర్‌ క్రైమ్‌లలో రికవరీలు అరుదు

స్కామ్‌ సొమ్ము వస్తురూపంలో తమ దేశాలకు

మనీమ్యూల్స్‌తోనూ లింకు లేకుండా వ్యవహారం

24 గంటల్లోగా ఫిర్యాదు చేయాలి: పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: లాటరీలు, బహుమతులు, సన్మానాల పేరుతో సంక్షిప్త సందేశాలు, ఈ–మెయిల్స్‌తో ఎరవేసి అందినకాడికి దండుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు దొరకడం దుర్లభంగా మారింది. ఒకవేళ నిందితులుగా ఉంటున్న నైజీరియన్ల చిక్కుతున్నా... వీరి నుంచి నగదు, సొత్తు రికవరీ చేయడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రజలు సైబర్‌ నేరాల్లో కోల్పోతున్న మొత్తాల్లో గరిష్టంగా 10 శాతం మాత్రమే రికవరీ చేయగలుగుతున్నామని సైబర్‌ క్రైమ్‌ అధికారులు పేర్కొంటున్నారు. మోసాల ద్వారా ఆర్జించిన సొమ్మును నైజీరియన్లు వస్తువులుగా మార్చి తమ దేశానికి తరలిస్తుండటమే ఇందుకు కారణమన్నారు. 

‘వివరాల’ సేకరణకు మార్గాలెన్నో...
సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ మోసాలను ఈ–మెయిల్‌ లేదా ఎస్సెమ్మెస్, ఫోన్‌కాల్‌తో ప్రారంభిస్తారు. అనేక మార్గాల ద్వారా మెయిల్‌ ఐడీలు, ఫోన్‌ నెంబర్లు సేకరిస్తారు. బహుమతులు, క్విజ్‌ల పేరుతో ఆన్‌లైన్‌లో చాలా సాధారణమైన ప్రశ్నలను అడుగుతూ వ్యక్తిగత వివరాలు పూరించమంటారు. మరోపక్క ఫ్రీ గిఫ్ట్‌ ఓచర్ల పేరుతో అనేక వాణిజ్య ప్రాంతాల్లో పేరు, నంబర్, మెయిల్‌ ఐడీలతో స్లిప్స్‌ పూరించి బాక్సుల్లో వేయించే విధానాలు ఇటీవల పెరిగాయి. ఇవన్నీ అనేక మార్గాల్లో సైబర్‌ నేరగాళ్లకు చేరుతున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా లక్ష ఫోన్‌ నెంబర్లు/ఈ–మెయిల్స్‌ రూ.30 వేలకు విక్రయించే వెబ్‌సైట్లూ ఉన్నాయి. వీటి ఆధారంగా ముఠాలుగా ఏర్పడి దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు ఏ సందర్భంలోనూ పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బ్యాంకు ఖాతాలకూ ‘వక్రమార్గాలు’...
స్కీములు, పన్నులు, పెట్టుబడులంటూ బాధితుల నుంచి సొమ్ము స్వాహా చేయడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని నైజీరియన్లే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలెక్కువ. దేశం బయట ఉన్న బ్యాంకులవి అయితే కస్టమర్లు అనుమానించే ప్రమాదం ఉంది. ఇందుకోసం వారు భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని  నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న ఈ ఏజెంట్లు బ్యాంకు ఖాతాలను తెరిచి, తమ వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ కమీషన్‌ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు కొందరు రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని తాము వైట్‌ మనీగా మారుస్తామని, అందుకోసమే ఖాతాలంటూ వారిని నమ్మిస్తున్నారు. వీరిని సాంకేతిక పరిభాషలో ‘మనీమ్యూల్స్‌’ గా పేర్కొంటారు. 

రోజుల్లోనే వస్తువులుగా ‘ఎక్స్‌పోర్ట్‌’...
దీంతో ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు నైజీరియన్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో వారిని పట్టుకోవడం కష్టమవుతోంది. కేవలం ఆయా ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు తీసుకుంటున్న నైజీరియన్లు తమ పని కానిస్తున్నారు. మోసాల ద్వారా సంపాదించిన సొమ్మును నగదు రూపంలో నైజీరియాకు పంపడం ఇబ్బందికరం కావడంతో దీనిని వస్తురూపంలోకి మార్చి తమ దేశానికి తరలిస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ముఠాలో కొందరు బిజినెస్‌ వీసాపై భారత్‌కు వచ్చి ఎక్కువగా వస్త్ర వ్యాపారుల ముసుగులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మొత్తాన్ని తమ వద్ద ఉంచుకుని, మిగిలిన దాంతో ఢిల్లీలో ఉన్న పాలికాబజార్, సరోజినీ మార్కెట్, చాందినీ చౌక్‌ల్లో హోల్‌సేల్‌గా వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. వీటిని బిజినెస్‌ వీసాపై వచ్చిన వారికి అప్పగించడం ద్వారా కన్‌సైన్‌మెంట్‌ రూపంలో ఓడల ద్వారా నైజీరియాకు పంపిస్తున్నారు. ఈ కన్‌సైన్‌మెంట్స్‌ను రిసీవ్‌ చేసుకునే ముఠా సభ్యులు నైజీరియాలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కారణంగానే నైజీరియన్ల నుంచి నగదు రికవరీ చేయడం అసాధ్యంగా మారుతోంది.

24 గంటల్లో ఫిర్యాదు చేయాలి
‘సైబర్‌ నేరాల్లో నిందితుల నుంచి రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారింది. ఈ కేసుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించడంలో ఆలస్యం చేస్తుండటం మరో ఇబ్బందికర అంశంగా మారుతోంది. బాధితులు 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే కొంత వరకు ఉపయుక్తం. నగదు ఆన్‌లైన్‌లో బదిలీ చేసినట్‌లైతే అది క్లియర్‌ కావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. ఏటీఎం ద్వారానూ నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఒకేసారి విత్‌డ్రా చేయలేరు. ఈ అవకాశాల్ని వినియోగించుకుని బ్యాంకును సంప్రదించడం ద్వారా విత్‌డ్రా కాకుండా ఆపి, రికవరీ చేయవచ్చు’.– సైబర్‌క్రైమ్‌ అధికారులు 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు