ఇచ్చట అన్ని డాక్యుమెంట్లు అమ్మబడును! 

12 Jul, 2018 12:53 IST|Sakshi
డి.విష్ణువర్ధన్‌

వీసా ప్రాసెసింగ్‌కు అవసరమైన పత్రాల తయారీ 

సాక్షి, హైదరాబాద్‌ : అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసా కోసం దాఖలు చేయాల్సిన పత్రాలు నకిలీవి తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. సూత్రధారిగాని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఏజెంట్ల కోసం గాలిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. భూపాలపల్లికి చెందిన డి.విష్ణువర్ధన్‌ బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. బీటెక్‌ మధ్యలోనే మానేసిన ఇతగాడు తొలినాళ్లల్లో అనేక కన్సల్టెన్సీల్లో పని చేశాడు. ఈ నేపథ్యంలోనే విష్ణుకు వీసా ప్రాసెసింగ్‌పై అవగాహన వచ్చింది. దీంతో 2013 నుంచి బంజారాహిల్స్‌ నెం.12లో తానే ఓ వీసా ప్రాసెసింగ్‌ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. నగరం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రస్తుతం విదేశాల్లో 14 మందిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు.

సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్లాలని భావిస్తున్న వారిని ఏజెంట్లు విష్ణు వద్దకు పంపేవారు. ఆ వ్యక్తి పేరుతో యూజర్‌ ఐడీ క్రియేట్‌ చేసి వీసా ఇంటర్వ్యూ స్లాట్‌ బుక్‌ చేసే విష్ణు అప్లికేషన్‌ సైతం డౌన్‌లోడ్‌ చేసేవాడు. వీసా ఇంటర్వ్యూ పై తర్ఫీదు ఇచ్చేవాడు. వీటితో పాటు ప్రాసెసింగ్‌కు అవసరమైన పత్రాలు నకిలీవి తయారు చేసి అందిస్తున్నాడు. ఈ పంథాలో ఇప్పటి వరకు దాదాపు 100 మందికి ప్రాసెస్‌ చేసి భారీగా దండుకున్నాడు. ఇతడి వ్యవహారాలపై స మాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు దాడి చేసి విష్ణును ప ట్టుకున్నారు. అతడి నుంచి 18 బోగస్‌ డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్,ప్రింటర్స్‌ స్వాధీనం చేసుకుని కేసును బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు