సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం

1 Jun, 2018 08:35 IST|Sakshi
 పోలీసుల అదుపులో సోషల్‌ మీడియా ప్రచారకులు  

రాయగడ : రాష్ట్రంలోని 30జిల్లాల్లో పిల్లలను ఎత్తుకుపోయి చంపి వారి అవయవాలను దోచుకుంటున్నారన్న తప్పుడు ప్రచారంతో సోషల్‌ మీడియాలో ప్రజలను భయభ్రాంతులను చేయడంతో పాటు  ఇతర ప్రాంతాల వారు, ఇతర భాషల వారు, మానసిక వికలాంగులను పిల్లల దొంగలుగా అనుమానించి దాడులు చేయడం, ప్రాణాలు తీయడం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం  పలెపల్లెకూ చేరింది. ప్రజలు భయం చెందవద్దని  పోలీసులు చెబుతున్నారు కానీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు విషమిస్తున్నప్పటికీ సైబర్‌ పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టిన సూచనలు కనిపించడం లేదు.

అయితే రాయగడ జిల్లాలో పిల్లల అపహరణకు ఇతర రాష్ట్రాల నుంచి ముఠాలు వచ్చి సంచరిస్తున్నాయని సోషల్‌ మీడియా ద్వారా భారీ ప్రచారం చేయడంతో ప్రజలు భయంచెంది అనుమానితులపై దాడులు చేసిన ఘటనలు స్థానిక పోలీసులకు తలనొప్పిగా మారాయి. దీంతో స్థానిక పోలీసులు ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం  ప్రారంభించారు. సోషల్‌ మీడియా ప్రచారాల వల్ల రాయగడ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలే కాక పట్టణప్రాంతాల్లో కూడా మానసిక వికలాంగులు,  ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొత్తవారిపై కూడా దాడులు జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను భయోత్పాతానికి గురి చేస్తున్న వ్యక్తులపై పోలీసులు చర్యలు చేపట్టారు.

అందులో భాగంగా రాయగడ రాణిగుడఫారానికి  చెందిన గౌరీశంకర్‌నాయడు, కిశోర్‌కిలొ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరిద్దరి తప్పుడు ప్రచారం వల్ల ఇటీవల మంకడజోల గ్రామాంలో రిశాన్‌ అనే పేరు గల మానసిక విలాంగుడిపై స్థానికులు దాడి చేసి తలపగలగొట్టారు. ఇది తెలుసుకున్న  పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మానసిక వికలాంగునికి రక్షణ కల్పించారు. ఈ దాడిలో పాల్గొన్న వారిపై చర్యలు చేపడుతూ సోషల్‌ మీడియా ద్వారా భయం కల్పించే ప్రసారాలను చేసిన ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు