Tribals Jallianwala bagh: ఆదివాసీల ‘జలియన్‌వాలాబాగ్’ ఘటన ఏమిటి?

18 Oct, 2023 08:37 IST|Sakshi

భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో దేశంలోని ప్రజలంతా ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కన్నారు. అటు జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం, ఇటు  విభజన వేదన లాంటివన్నీ మరచిపోయి ముందుకు సాగాలనే తపన నాటి ప్రజల్లో అణువణువునా ఉండేది. అయితే స్వాతంత్య్రం వచ్చిన 138 రోజులకు దేశంలోని ఆదివాసీలు ‘జలియన్‌వాలాబాగ్’ లాంటి మరో దారుణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 

ఒరిస్సా పోలీసులు నిరాయుధులైన గిరిజనులను చుట్టుముట్టి, స్టెన్ గన్‌లతో వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 2000 మంది మృతి చెందారు. ఈ దారుణం 1948, జనవరి ఒకటిన చోటుచేసుకుంది. ఖర్సావాన్ ప్రాంతం జంషెడ్‌పూర్(జార్ఖండ్‌) నుండి కేవలం 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వాతంత్ర్యం తర్వాత సెరైకెలా, ఖర్సావాన్‌లను ఒరిస్సాలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ మంది ఒడియా మాట్లాడే వారు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రెండు ప్రాంతాలలో ఉంటున్న గిరిజనులు తమను బీహార్‌లోనే ఉంచాలని కోరారు. నాటి రోజుల్లో జైపాల్ సింగ్ ముండా  అనే గిరిజన నేత పిలుపు మేరకు నిరసనలు చేపట్టేందుకు దాదాపు 50 వేల మంది గిరిజనులు ఖర్సావాన్‌కు తరలివచ్చారు.

ఒరిస్సా ప్రభుత్వం ఈ ఆందోళనను అణచివేయాలని భావించింది. ఒరిస్సా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖర్సావాన్‌ను కంటోన్మెంట్‌గా మార్చారు. సైనిక బలగాలను మోహరించారు. అయితే ఏవో కారణాలతో జైపాల్ సింగ్.. ఖర్సావాన్ చేరుకోలేకపోయాడు. దీంతో 50 వేల మంది గిరిజనులు ఈ విలీనానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వినతి పత్రం  సమర్పించిన అనంతరం ఖర్సావాన్ మైదానంలో తిరిగి సమావేశమయ్యారు. కొందరు గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో ఒరిస్సా మిలటరీ సైనికులు గిరిజనులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణం అనంతరం కేవలం 35 మంది గిరిజనుల మరణాన్ని ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 

కోల్‌కతా నుండి ప్రచురితమయ్యే  స్టేట్స్‌మన్ అనే ఆంగ్ల వార్తాపత్రిక 1948 జనవరి 3న ఆందోళనల్లో 35 మంది గిరిజనులు మరణించిన వార్తను ప్రచురించింది. కాగా మాజీ ఎంపీ మహారాజా పీకే దేవ్ రాసిన ‘మెమోయిర్ ఆఫ్ ఎ బైగోన్ ఎరా’ పుస్తకంలో నాటి ఆందోళనలో రెండు వేలమంది గిరిజనులు హత్యకు గురయ్యారని రాశారు. నాటి కాల్పుల్లో వేలాది మంది ఆదివాసీలు మృతి చెందారని అప్పటి నేతలు కూడా ప్రకటించారు. ఒరిస్సా మిలటరీ సైనికులు సాగించిన ఈ దురాగతానికి సంబంధించిన చాలా పత్రాలు అందుబాటులో లేవు. అయితే ఈ ఘటనపై పలు కమిటీలు వేసినట్లు వెలుగులోకి వచ్చింది. విచారణ కూడా జరిగింది. కానీ ఈ ఫలితాలు ఏమిటో నేటికీ వెల్లడికాలేదు. 

‘జలియన్ వాలాబాగ్’ దారుణం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన ఘటన. జలియన్ వాలాబాగ్ అనేది అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు చేసుకునేందుకు వచ్చిన వారిపై  జనరల్ డయ్యర్ సారథ్యంలో బ్రిటీష్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వెయ్యి మందికి పైగా మరణించగా, రెండువేల మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: యుద్ధ నేరం అంటే ఏమిటి? అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏం చేస్తుంది?

మరిన్ని వార్తలు