స్కానింగ్‌లకు వేలల్లో ఫీజులు

21 Oct, 2023 00:32 IST|Sakshi

గంట్యాడ మండలానికి చెందిన బి.శ్రీనివాస్‌ తలనొప్పి అని విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లడంతో వైద్యుడు ఆయనకు ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించాలని చీటీ రాసి ఇచ్చాడు. దీంతో ఆ వ్యక్తి ఓ ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్‌లో రూ.4 చెల్లించి స్కానింగ్‌ తీయించుకున్నాడు.

● ఇదే మండలానికి చెందిన ఆర్‌. అప్పారావు కాలి బొటన వేలు ఇన్‌ఫెక్షన్‌ అవడంతో విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా బొటన వేలు తొలగించడానికి రూ.40 వేలు బిల్లు వేశారు.

● రెండు రోజుల పాటు జ్వరం రావడంతో విజయనగరానికి చెందిన మురళి ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు రాశారు. వైద్య పరీక్షలన్నింటికీ రూ.1,000 బిల్లు అయింది.

● ఇలా ఈ ముగ్గురికే కాదు అనేక మంది రోగులకు నిత్యం ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబొరేటరీల్లో ఎదురువుతున్న పరిస్థితి ఇది. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబొరేటరీలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా స్కానింగ్‌, వైద్య పరీక్షలు రాసి ప్రజల నుంచి దోపిడీకి పాల్పడుతున్నాయి. వైద్యులు రాస్తున్న పరీక్షలు, స్కానింగ్‌ చేయించుకోకపోతే ఏమోవుతుందోనని భయంతో వేలల్లో ఫీజులు చెల్లించి రోగులు చేయించుకుంటున్నారు.

జ్వరం అని చెబితే చాలు వైద్యపరీక్ష

జ్వరం అని ఎవరైనా ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగానే వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా వైరల్‌, డెంగీ, మలేరియా, సీబీసీ, హెచ్‌బీ ఇలా అనేక రకాల వైద్య పరీక్షలు రాసేస్తున్నారు. దీంతో రోగులకు తడిసి మోపుడువుతోంది.

స్కానింగ్‌లకు వేలల్లో ఫీజులు

సిటిస్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌లకు అయితే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అయితే రోగికి కచ్చితంగా అవసరమని వైద్యులు నిర్ధారిస్తే ఉచితంగా తీస్తారు. కానీ ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్‌లో మాత్రం సిటిస్కాన్‌కు రూ.2500 నుంచి రూ. 3 వేలు, ఎంఆర్‌ఐ స్కాన్‌కు అయితే రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అవుతుంది. చాలా మంది ప్రైవేట్‌ వైద్యులకు ఆయా స్కానింగ్‌ సెంటర్లలో షేర్‌ ఉంటుంది. షేర్‌ లేని వైద్యులకు ఆ సెంటర్లు కమీషన్‌ ఆఫర్‌ చేస్తాయి. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు స్కానింగ్‌లు రాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్‌ఎంపీలే మధ్యవర్తులు

ప్రైవేట్‌ ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లు, ల్యాబొరేటరీలకు ఆర్‌ఎంపీలే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. కేసును బట్టి వారికి ఆయా ఆస్పత్రి, స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు కొంతమంది స్థానికంగా ఉంటున్న ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందుతున్నప్పటికీ, రోగులను వారు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాలని సిఫార్సు చేస్తున్నారు.

జిల్లాలో ఆస్పత్రుల వివరాలు :

జిల్లాలో 79 క్లినిక్‌లు, 122 ప్రైవేటు నర్సింగ్‌ హోమ్‌లు ఉన్నాయి. 58 ల్యాబొరేటరీలు, 83 ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి. ఆయా ఆస్పత్రులకు రోజుకు 10 వేల నుంచి 12 వేల మంది రోగులు వెళ్తున్నారు. వారిలో ఇన్‌పేషేంట్లుగా 1000 నుంచి 2 వేల మంది వరకు చేరుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో వేలాది మందికి వైద్య పరీక్షలు రాస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

రిజిస్ట్రేషన్‌ లేకుండానే ల్యాబ్‌ల నిర్వహణ

జిల్లాలో 58 ల్యాబొరేటరీలు మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. రిజిస్ట్రేషన్‌ లేకుండా 100 వరకు జిల్లాలో ల్యాబొరేటరీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వైరల్‌ జ్వరాలు, డెంగీ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో ల్యాబొరేటరీలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఏ ల్యాబొరేటరీలో కూడ ఏ వైద్య పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తారో తెలిపే బోర్డు ఉండదు. దీంతో వారు ఎంత అడిగితే అంత ఇవ్వవలసిన పరిస్థితి.

ల్యాబొరేటరీల్లో కానరాని పెథాలజిస్టులు

జిల్లాలో ఉన్న ల్యాబొరేటరీల్లో పెథాలజిస్టులు కానరావడం లేదు. నిబంధన ప్రకారం యూరిన్‌ కల్చర్‌, బ్లడ్‌ కల్చర్‌ , ప్లేట్‌లెట్‌ కౌంట్‌ వంటి పరీక్షలు పెథాలజిస్టుల పర్యవేక్షణ జరగాలి. ఒకటి, రెండు ల్యాబొరేటరీల్లో తప్ప మిగతా చోట వారు కనిపించరు.

మరిన్ని వార్తలు