పోడు ‘పోరాటం’..!

29 Jun, 2018 12:30 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న గిరిజనులు 

పర్ణశాల: ఏజన్సీలోని పచ్చని పల్లెలు.. ఇప్పుడు పోడు భూముల వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు గిరిజనులు తాము కష్టపడి పోడు కొట్టి, వాటి రక్షణ కోసం అటవీ అధికారులతో కొట్లాడారు. కానీ ఇప్పుడు ఒకరి పోడు భూమిని మరొకరు దుక్కులు దున్నుతున్నారు. ఘర్షణకు దిగుతున్నారు. దీంతో పల్లెలు పగతో రగిలిపోతున్నాయి. దుమ్ముగూడెం మండలంలో రోజుకొక్క ఊరిలో పోడు భూముల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి.

కేసులు నమోదవుతున్నాయి. గిరిజనులు ప్రతి రోజు పోలీస్‌ స్టేషన్‌ చుట్టు తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితం సిగారం, రామరావుపేట  గ్రామాల మధ్య పోడు వివాదంతో మొదలైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ఒక మహిళకు తీవ్రంగా, ఇంకొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ తరువాత రోజు జిన్నెలగూడెం, చింతగుప్ప గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. గురువారం చిన్ననల్లబల్లి మరో ఘటన జరిగింది. ఇలా ప్రతి రోజు ఏదో ఒక ఊరిలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ వివాదాలను రాజకీయ లబ్దికోసం వాడుకునేందుకు పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన భూతగాదాలు అన్ని గ్రామాల్లో రాత్రులే జరిగాయి. ఇప్పటికైనా ఈ వివాదాలను పోలీసు ఉన్నతాధికారులు పరిష్కరించకపోతే సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది.

మరిన్ని వార్తలు