బీజేపీ నేత దారుణ హత్య.. ఐదుగురికి జీవితఖైదు

27 Jul, 2019 10:29 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం: పదేళ్ల క్రితం జరిగిన బీజేపీ నేత దారుణ హత్య కేసులో కేరళ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. హత్య కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చుతూ.. జీవితఖైదు శిక్షను విధించింది. వివరాలు.. కేరళలోని కాన్నూర్‌ జిల్లాలో తలసిరై వద్ద 2008లో బీజేపీ నేత కేవీ సురేంద్రన్‌ స్థానిక సీపీఎం కార్యకర్తల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య కళ్లముందే ఆయనను వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. అయితే ఐదుగురికి సంబంధించిన సాక్ష్యాలను మాత్రమే కోర్టు స్వీకరించడంతో.. ఇద్దరికి కేసు నుంచి విముక్తి లభించింది.

పదేళ్లకు పైగా సాగిన కేసు విచారణలో న్యాయమూర్తి శుక్రవారం తుది తీర్పును వెలువరించారు. బీజేపీ నేతను హత్య చేసిందుకు ఐదుగురికి జీవిత ఖైదుతో పాటు.. ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించారు. ఈ డబ్బంతా సురేంద్రన్‌ భార్య ఖాతాలో జమచేయాలని కోర్టు ఆదేశించింది. కాగా ఘటన జరిగే ముందు కాన్నూర్‌ ప్రాంతంలో బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చేటుచేసుకున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే ఆయనను హత్య చేసినట్లు స్థానికులు చెపుతున్నారు. తాజా తీర్పు పట్ల ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు