CPM: ఒంటరిగా బరిలోకి.. సీపీఎం పోటీతో లాభపడేది! నష్టపోయేది ఎవరు?

19 Nov, 2023 16:01 IST|Sakshi

ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 వరకు జిల్లాలో ఎర్ర పార్టీలకు ఏదో ఒకచోట ఎమ్మెల్యే ఉండేవారు. కాని తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు అసెంబ్లీలోనే ఉనికి లేకుండా పోయింది. ఒకనాటి ఉద్యమ కేంద్రంలో ఒక్క సీటైనా గెలుచుకోవాలనే ఆరాటం కొనసాగుతోంది. కాని ఈసారి ఒంటరిగా బరిలో దిగిన సీపీఎం ఒక్క సీటైనా గెలుస్తుందన్న నమ్మకం లేదనే టాక్ నడుస్తోంది. అయితే సీపీఎం పోటీతో లాభపడేది ఎవరు? నష్టపోయేది ఎవరు అంటూ చర్చలు సాగుతున్నాయి? జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

ఉమ్మడి రాష్ట్రంలో ఒకనాడు కమ్యూనిస్టు ఉద్దండులు అసెంబ్లీలో ఉండేవారు. వారిలో ఎక్కువ భాగం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే వచ్చేవారు. రాను రాను కమ్యూనిస్టు పార్టీలు అటు రాష్ట్రంలోను.. ఇటు జిల్లాలోనూ ఉనికి కోసమే పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎం గట్టి పట్టు ఉండి.. అనేకసార్లు గెలిచిన నకిరేకల్, మిర్యాలగూడ స్థానాలు కూడా గెలవలేని స్థితికి వచ్చారు.

2009లో సింగిల్‌గా మిర్యాలగూడ స్థానాన్ని గెలుచుకున్న సీపీఎం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓడిపోతూనే వచ్చింది. మూడు సార్లు గెలిచిన జూలకంటి రంగారెడ్డి తాజా ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రాష్ట్రంలో రెండో మూడు సీట్లైనా గెలచుకోవడానికి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సీపీఎం చాలా ప్రయత్నించింది. కాని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఆఖరు నిమిషంలో హ్యాండివ్వడంతో సీపీఎం ఒంటరిపోరుకే సిద్ధపడింది. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా.. ఏడు నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు బరిలో దిగారు. మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పోటీలో ఉంటే.. ఎవరికి నష్టం అనే చర్చ జరుగుతోంది. పార్టీ బలహీనం అయినా ప్రతీ నియోజకవర్గంలో ఆ పార్టీకి కనీసం మూడు వేల ఓట్లయినా ఉంటాయి. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో ఈ ఓట్ల చీలికతో ఏ పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయనే చర్చల్లో.. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది.

మిర్యాలగూడలో గత ఎన్నికల్లో పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డికి పదకొండు వేల ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఆయన ఎన్ని ఓట్లు చీలుస్తారనేది కీలకంగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. జూలకంటి రంగారెడ్డి ప్రధానంగా కార్మికులతో పాటు వ్యవసాయ కూలీల ఓట్లపైనే  నమ్మకం పెట్టుకున్నారు. రంగారెడ్డి చీల్చే ఓట్లపైనే మిర్యాలగూడ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
చదవండి: బండి సంజయ్‌​ వర్సెస్‌ గంగుల కమలాకర్‌

జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో సీపీఎం నేత నర్రా రాఘవరెడ్డి ఆరుసార్లు విజయం సాధించారు. ఆతర్వాత నోముల నర్సింహయ్య రెండుసార్లు గెలిచి..తర్వాత గులాబీ పార్టీలో చేరి.. ఒకసారి విజయం సాధించారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ పార్టీ నామమాత్రంగా తయారైంది. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ నుంచి వేముల వీరేశం పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచినా మూడు నుంచి ఐదు వేల ఓట్ల మధ్యనే మెజార్టీ ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో గెలుపోటములకు సీపీఐఎం అభ్యర్థి చినవెంకులు చీల్చే ఓట్లే కీలకం కానున్నాయి.

ఇక నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా నంద్యాల నర్సింహ్మారెడ్డి ఒకసారి గెలిచారు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పోటీలో నిలుస్తున్నారు. పాత తిప్పర్తి మండలంలో జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన ఆయనకు మండలంతో పాటు నియోజకవర్గంలో కూడా మంచి పరిచయాలే ఉన్నాయి. తిప్పర్తి మండలం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. దీంతో ఆయన ఏమేరకు ఓట్లు చీలుస్తారనేది కీలకంగా మారింది. గతంలో సీపీఎంలో పనిచేసిన నేతలంతా ప్రస్తుతం అధికార పార్టీ చేరిపోయారు. 

మునుగోడులో సీపీఐకి మంచి పట్టుంది. కానీ మొదటి నుంచి ఇక్కడ సీపీఐ అభ్యర్థికే సీపీఎం మద్దతు ఇస్తూ వస్తోంది. సీపీఐ పలుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఇక్కడ సీపీఐ పోటీ చేయడంలేదు...కాంగ్రెస్‌తో ఉన్న పొత్తు కారణంగా...హస్తం పార్టీ అభ్యర్ధికే సీపీఐ మద్దతు ఇస్తుంది. అందువల్ల సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తోంది. సీపీఎం నుంచి దోనూరి నర్సిరెడ్డి బరిలో ఉన్నా ఆయన ప్రభావం అంతంత మాత్రమే అంటున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో నర్సిరెడ్డి చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి. ఇక భువనగిరి, హుజూర్ నగర్, కోదాడల్లో ఆ పార్టీ పోటీ చేస్తున్నా అక్కడ సీపీఎంకు చెప్పుకోదగిన బలం లేదు. అయినా మూడు నుంచి ఐదు వేల ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కావడంతో అధికార పార్టీకి ప్లస్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. 

వర్తమాన రాజకీయాల దృష్ట్యా సీపీఎం లేదా సీపీఐ పార్టీలు ఒంటరిగా బరిలో దిగి విజయం సాధించే పరిస్థితులు అయితే లేవు. ఏదో ఒక పార్టీతో పొత్తు ఉంటేనే గెలిచే అవకాశాలుంటాయి. అందువల్ల ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీపీఎం అభ్యర్థులకు పడే ఓట్ల వల్ల ఏదో ఒక పార్టీకి లాభం, మరో పార్టీకి నష్టం కలగక తప్పదనే టాక్ నడుస్తోంది. మొత్తంగా సీపీఐఎం బరిలో ఉండటంతో అధికార పార్టీ లాభపడే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

మరిన్ని వార్తలు