పరిశ్రమలకు రుణాలంటూ ప్రజాప్రతినిధులకు టోకరా

30 Jun, 2020 03:46 IST|Sakshi
బాలాజీ నాయుడు

మార్జిన్‌ మనీ పేరుతో మోసాలు

చాకచక్యంగా నిందితుడిని పట్టించిన ఎమ్మెల్సీ ఇక్బాల్‌  

హిందూపురం: పరిశ్రమలకు సబ్సిడీ రుణాల పేరుతో ప్రజాప్రతినిధులను మోసగించిన ఓ సైబర్‌ నేరగాడిని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ చాకచక్యంగా పట్టించారు. నిందితుడితోపాటు అతడికి సహకరించిన వ్యక్తిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఇలా వల వేయబోయి.. అలా చిక్కాడు
► తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన బాలాజీ నాయుడు రెండు రోజుల క్రితం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఫోన్‌ చేశాడు. తాను సెంట్రల్‌ ఇండస్ట్రీస్‌ డిప్యూటీ సెక్రటరీనని నమ్మబలికాడు. 
► కేంద్ర ప్రభుత్వం పీఎంవీవై పథకం కింద రూ.50 లక్షలు స్మాల్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ రుణాలు అందిస్తోందని, ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుందని చెప్పాడు. 
► లక్షకు రూ.25 వేల చొప్పున మార్జిన్‌ మనీ కట్టాలని, నియోజకవర్గం నుంచి దరఖాస్తులు పంపించాలని కోరాడు.
► ఈ విషయమై ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను సంప్రదించాలని నిందితుడికి మాధవ్‌ సూచించారు. నిందితుడు ఎమ్మెల్సీకి ఫోన్‌ చేయగా.. ఆయన మంత్రి పర్యటనలో ఉన్నందున ఈ వ్యవహారాన్ని చూడాలని తన అనుచరుడైన గోపీకృష్ణకు అప్పగించారు. 
► గోపీకృష్ణ నిందితుడితో ఫోన్‌లో మాట్లాడి ఏడుగురి పేర్లు అందచేసి మార్జిన్‌ మనీని అతడి ఖాతాలో జమ చేశారు.
► నిందితుడు ఆదివారం రాత్రి మరోసారి ఎమ్మెల్సీకి ఫోన్‌ చేసి ఇంకా ఎవరైనా ఉంటే మార్జిన్‌ మనీ జమ చేయించాలని అడగ్గా.. ఐజీగా పని చేసిన అనుభవం ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ నిందితుడి వ్యవహారంపై అనుమానం వచ్చి బ్యాంక్‌ ఖాతా వివరాలను పరిశీలన చేయించారు.
► ఆ ఖాతా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిదని గుర్తించి.. వెంటనే అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబును అప్రమత్తం చేశారు. 
► ఎస్పీ ఆదేశాల మేరకు హిందూపురం ఎస్‌ఐ శేఖర్‌ ఆదివారం అర్ధరాత్రి పెద్దాపురం వెళ్లి నిందితుడు బాలాజీ నాయుడు, అతడికి సహకరించిన వెంకట తాతారెడ్డిని అరెస్ట్‌ చేశారు. 

బాలాజీ ఉచ్చులో 60 మంది!
► బాలాజీనాయుడు ఉచ్చులో పడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 60 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మోసపోయినట్లు భావిస్తున్నారు. 
► అతడు 2009లోనూ ఇదే తరహా మోసం కేసులో తెలంగాణ పోలీసులకు చిక్కి శిక్ష అనుభవిస్తూ రెండు రోజుల క్రితమే విడుదలయ్యాడు.

మరిన్ని వార్తలు