పారిశ్రామికవాడలో సాధికార నినాదం

21 Nov, 2023 05:16 IST|Sakshi
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం

యలమంచిలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విజయ యాత్ర

వేలాది ప్రజలతో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర

జనంతో కిక్కిరిసిన యలమంచిలి –  అచ్యుతాపురం రహదారి

చల్లటి వాతావరణంలో సామాజిక సాధికార సభ

సీఎం జగన్‌ సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని వివరించిన నేతలు

హర్షధ్వానాలు చేసిన ప్రజలు

సాక్షి, అనకాపల్లి: పారిశ్రామికవాడలో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. సోమవారం అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు విజయ యాత్ర చేశారు. ఈ యాత్రకు వేలాదిగా తరలివచ్చిన ఈ వర్గాల ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో తమకు లభించిన ప్రాధాన్యతను, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గం మొత్తం కలియదిరిగారు. ఈ యాత్రతో యలమంచిలి–­అచ్యుతాపురం రహదారి జనంతో కిక్కిరిసిపోయింది.

జగన్‌ నామస్మరణతో ఊరూవాడా మార్మో­గాయి. అచ్యుతాపురంలో సభ జరిగిన క్రీడా మైదానం నిండిపోవడంతో పాటు యలమంచిలి రోడ్డు, పూడిమడక రోడ్డు జనంతో నిండిపోయాయి. సాయంత్రం చల్లబడి చిన్న పాటి చినుకులు పడడంతో ఆహ్లాదకర వాతావరణంలో సభ జరిగింది. మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని వివరించినప్పుడు ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. 

పేదల బతుకులు మార్చిన సీఎం జగన్‌ : మంత్రి ధర్మాన
సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ మేలు చేస్తూ వారి బతుకులను మారుస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రామ­రాజ్యాన్ని మించి జగనన్న రాజ్యాన్ని తీసుకొచ్చా­రని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. ఈ వర్గాలకు చట్టసభల్లో అవకాశం కల్పించారని, కేబినెట్‌లో 17 కీలక మంత్రి పదవులు ఇచ్చి దేశ చరిత్రలోనే ఏ సీఎం చేయని విధంగా సామాజిక న్యాయం చేశారని అన్నారు.

బడుగుల కుటుంబాలన్నీ ఆర్థికంగా బలపడ్డాయని, ఇది కాదా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల పేరిట డబ్బు వృథా చేస్తున్నారని అన్న ప్రతి­పక్షనేత చంద్రబాబు ఇప్పుడు అంతకు రెట్టింపు పథకాలు ఇస్తానంటున్నాడని, ఆయన మాయమాట­లను నమ్మకుండా అందరూ అప్రమత్తంగా వ్యవహరిం­చాలని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో పేదోడు ఎదిగాడు: ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు
సీఎం జగన్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సాధికారత తీసుకొచ్చార­న్నారు. సీఎం జగన్‌ బడుగు బలహీనర్గాలకు చెందిన నలుగురికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పిం­చారన్నారు. రాజ్యసభకు నలుగురు బీసీలను పంపించారన్నారు. అనేక మందిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేశారని, నామినేటెడ్‌ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేశారని చెప్పారు. చంద్రబాబు పాలనలో సామాజిక న్యాయమనే పదమే రాలేదని చెప్పారు. 

మహిళా సాధికారత మరువరానిది: ఎంపీ సత్యవతి
అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారని, విద్య, వైద్యంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. మహిళా సాధికారత తీసుకొచ్చారని చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిని మహిళల ఖాతాల్లోనే జమ చేస్తున్నారన్నారు.  

జెట్టీల నిర్మాణంతో మత్స్యకారులకు మహర్దశ: ఎమ్మెల్యే రమణమూర్తిరాజు
యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబురాజు) మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమని చెప్పారు. మత్స్యకారుల కోసం రాష్ట్రంలో కొత్తగా 8 జెట్టీలు నిర్మిస్తున్నారని, వాటిలో రూ.397 కోట్లతో నిర్మిస్తున్న అచ్యుతాపురం జెట్టీ కూడా ఒకటన్నారు. దాదాపు 950 పడవలు వేటకు వెళ్లేలా జెట్టీ ఉంటుందని, జిల్లాలోని మత్స్యకారులంతా వేటాడుకున్నా సరిపోయేంత పెద్దగా ఉంటుందన్నారు. పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.

ఆనాడు వైఎస్సార్‌ తీసుకొచ్చిన పారిశ్రామిక సెజ్‌ కారణంగా ఈ ప్రాంతవాసులు ఆర్థికంగా బలోపేతమ­య్యారని, 2 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ సెజ్‌లను బలోపేతం చేసి, కొత్త పరిశ్రమలు తెస్తున్నారని, వీటి ద్వారా లక్షలాది ఉద్యోగాలు కొత్తగా వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల వైస్‌ చైర్మన్‌ నారాయణమూర్తి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు