గంగమ్మ తిరిగొచ్చింది!

25 Jun, 2018 18:46 IST|Sakshi
కుటుంబ సభ్యులతో గంగమ్మ 

నారాయణపేట రూరల్‌ : దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ మహిళ ఎట్టకేలకు తిరిగొచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సింగారం గ్రామానికి చెందిన గంగమ్మ కూలీ పనిచేస్తుండగా.. భర్త పశువులు కాసేవారు. ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు.

అయితే భర్త అనారోగ్యం పాలుకావడంతో కుటుంబ పోషణ గంగమ్మపై పడింది. దీంతో మానసిక ఒత్తిడికి లోనై చిన్న కూతురు రేణును తీసుకుని అదృశ్యమైంది. ఏళ్ల తరబడి ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఇంట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు పనిచేసుకుంటూ తండ్రిని పోషిస్తూ వచ్చారు.

గ్రామానికి చెందిన పెద్ద మనుషులు దగ్గరుండి వారికి వివాహం చేశారు. ఈ క్రమంలో గత పదేళ్ల క్రితం గంగమ్మ భర్త మృతిచెందాడు. అదృశ్యమైన గంగమ్మ నాలుగేళ్ల క్రితం చేతకాని పరిస్థితుల్లో భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌ పంచాయతీ రావులపల్లికి ఒంటరిగా చేరుకుంది.

అక్కడే పాచి పనిచేస్తూ కాలం వెళ్లదీసింది. ఈ నెల 19న కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆచూకీ అడగటంతో సొంతూరు సింగారం అని చెప్పడంతో గ్రామ యువకులు సర్పంచ్‌ నాగిరెడ్డికి సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించి గంగమ్మ పెద్ద కుమార్తె చెన్నమ్మకు చెప్పి, భూత్పూర్‌ పోలీసుల సహకారంతో ఆమెను అప్పగించారు.

మరిన్ని వార్తలు