తప్పిపోతున్న వారందరూ ఏమైపోతున్నారు?!

8 Oct, 2018 09:07 IST|Sakshi

అసలు ఏం జరుగుతోంది.. జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వారానికి ఒకటీరెండు మిస్సింగ్‌ కేసులు నమోదవుతున్నాయి.. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువతులు అదృశ్యమైపోతున్నారు.. వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు.. మనుషుల అక్రమ రవాణా జరుగుతోందా.. లేక తప్పిపోతున్నారా.. వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తున్నారా.. ఎక్కడికైనా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడుతున్నారా.. ఇంతకు ఏం జరుగుతోంది.. అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు.  

మహబూబ్‌నగర్‌ క్రైం : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న లోకేష్‌ కనిపించకుండా పోయాడు.. బోయపల్లికి చెందిన చరణ్‌ అనే విద్యార్థి బడికి వెళ్లి వస్తానని చెప్పి ఇంతవరకు తిరిగిరాలేదు. పట్టణంలోని బాల సదనం నుంచి శైలజ అనే చిన్నారి అదృశ్యమైంది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మిస్సింగ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే నెలకు 20 మంది అదృశ్యమయ్యారు. ఈ లెక్కన జిల్లాలో ని త్యం కనిపించకుండా పోతున్న వారి సంఖ్య ఎంత ఉంటుందో అంచన వేయడం కూడా కష్టసాధ్యం.
 
ప్రతీస్టేషన్‌లో ఇలాంటి కేసులే.. 
జిల్లాలో మనుషుల అక్రమ రవాణ సాధారణమై పోయింది. ఒక్క రోజులో ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఒకటి లేదా రెండు కేసులు ‘మా వాళ్లు అదృశ్యం అయ్యారని’  బాధితులు ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, బాలికలే అధికంగా ఉన్నట్లు సమాచారం. గత సంవత్సరానికి ఒక్క మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సగటున 720 మంది కనిపించకుండా పోయినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. వారిలో కొందరు మతిస్థిమితం లేనివారు,  ప్రేమించిన వారితో వెళ్తున్నవారు, వివాహేతర సంబంధాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అదృశ్యమైన వారు ఉన్నారు. మరికొందరు ఇతర కారణాల వల్ల కన్పించకుండా పోతున్నారు. వారిలో చాలా మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.
 
నిత్యం నిరీక్షణ 
అదృశ్యమైన వారి ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు, అయినవాళ్లు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. గత మూడేళ్లలో 18 సంవత్సరాలు పైబడినవారు 963మంది కనిపించకుండా పోయారు. వారిలో 259మంది ఆచూకీ లభ్యం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక గల్ఫ్‌ అక్రమ రవాణా గురించి చెప్పనక్కరలేదు. అభం శుభం తెలియని అమాయకులకు గాలం వేస్తూ కొందరు నకిలీ ఏజెంట్లు వారివద్ద లక్షలాది రూపాయల డబ్బులు వసూలు చేసి గల్ఫ్‌ దేశాలకు పంపిస్తున్నారు. మూడునాలుగేళ్లు కుటుంబాలకు దూరంగా ఉండి కష్టపడి నాలుగు రాళ్లు సంపాదిద్దామని వెళ్లిన అమాయకులు తాము మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నకిలీ ఏజెంట్ల చేతిలో జిల్లా వ్యాప్తంగా ఏడాదికి సుమారుగా రెండు వేల మంది నష్టపోతున్నారు.

వలసల్లోనూ మోసాలు 
జిల్లాలోని మక్తల్, నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో వలస వెళ్తున్న వారున్నారు. వీరిలో దినసరి కూలీలు చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి అదశ్యమవుతున్నారు. ముఖ్యంగా కోయిలకొండ, నవాబ్‌పేట, మద్దూర్‌ మండల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన వారు ముంబాయి, కర్ణాటక, పూణే తదితర నగరాలకు వెళ్లి చాలా మంది తప్పిపోతున్నారు. దీంట్లో కొంత మంది మహిళలు, అమ్మాయిలను ఏజెంట్లు ఇతర ప్రాంతాల్లో ఉపాధి చూపిస్తామని తీసుకువెళ్లిన వారిలో చాలా వరకు వెనుక్కి తిరిగి రావడం లేదు.

రోజురోజుకు పెరుగుతున్న కేసులు 
జిల్లాలోని 31 పోలీస్‌స్టేషన్లలో వందల సంఖ్యలో మిస్సింగ్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తప్పిపోయిన వారి కోసం ఇటూ కుటుంబ సభ్యులు, అటు బంధువులు గాలిస్తుంటే మరోవైపు పోలీసులు వారి కోణంలో విచారణ చేస్తున్నారు. స్టేషన్లలో నమోదైన కేసుల్లో చాలా వరకు అదృశ్యమైన వారు కనిపించకపోవడంతో పెండింగ్‌లో ఉండటం విశేషం. అయితే చాలా వరకు పోలీసులు అదృశ్యం అవుతున్న కేసులపై ఎక్కువ ఆసక్తి చూపించకపోవడం వల్ల వారి సంఖ్య పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన ఫైల్‌ను గాలికి వదిలేస్తున్నారు. 

ఇవీ కారణాలు

పాఠశాలలో, కళాశాలలో, హాస్టళ్లలో ఉపాధ్యాయులు, వార్డెన్లు మందలించారని, ఇంట్లో తల్లిదండ్రులు నిత్యం తిడుతున్నారని.. పిల్లలు, విద్యార్థులు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారు. కొంత మంది వివాహితులు ఇష్టంలేని పెళ్లి చేశారని వెళ్లిపోతుండగా మరికొంత మహిళలు భర్తలు, అత్తమామలు వేధింపులకు తట్టుకోలేక ఇంటి గడప దాటుతున్నారు. ఇంకొందరు ఆరోగ్యం బాగాలేక, మానసిక పరిస్థితి సక్రమంగా ఎటూ వెళ్తున్నామో తెలియక వెళ్తున్నారు. ఇలా వెళ్లిన వారిలో కొందరు మత్యువాతపడితే మరికొందరూ రోడ్లపై యాచకులుగా తయారవుతున్నారు. 

ఇవీ తీసుకోవాల్సిన చర్యలు 

  • పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి 
  • పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి. 
  • రైళ్లు, బస్సులను, ఇతర వాహనాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించాలి.  
  • ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు పాఠశాల యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. 
  •  పిల్లలకు ఇంటి చిరునామాలు, సెల్‌ఫోన్‌ నెంబర్స్‌ గుర్తుండేలా నేర్పించాలి. 
  • పరిచయం లేని వ్యక్తులతో వెళ్లకపోవడంతోపాటు వారు అందించే తినుబండారాలను తిరస్కరించేలా జాగ్రత్త పడాలి.  

మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి  

జిల్లాలో నమోదవుతున్న మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం. కొన్ని స్టేషన్ల పరిధిలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు మారం చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకునే లక్షణాలను ముందే పసిగట్టి కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఈ విషయంపై 
అవగాహన కల్పిస్తున్నాం. – రెమారాజేశ్వరి, ఎస్పీ,మహబూబ్‌నగర్‌  

మరిన్ని వార్తలు