ఒక్క సీటుకు జాబితా.. దేనికి సంకేతం?

28 Oct, 2023 02:32 IST|Sakshi

పార్టీలో జితేందర్‌ రెడ్డి పంతం నెగ్గించుకున్నారనే చర్చ 

మరో 45 స్థానాలపై ముఖ్య నేతల కసరత్తు 

1న మలి జాబితా ప్రకటించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: కేవలం ఒకే ఒక సీటుకు అభ్యర్థి ని ప్రకటించి... అదీ రెండో జాబితా అంటూ పేర్కొనడం దేనికి సంకేతమనే చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. మొదటి జాబితాను 55 మందితో విడుదల చేయాలని భావించినా 52 మందితో ఈనెల 22న తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మిగిలిపోయిన మూడింటిలో ఒకటైన మహబూబ్‌నగర్‌కు పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి కుమారుడు ఏపీ మిథున్‌కుమార్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఢిల్లీ నుంచి ఒకే పేరుతో జాబితా వెలువడింది.

పార్టీ టికెట్‌ కోసం మహబూబ్‌నగర్‌ నుంచి జితేందర్‌రెడ్డి, షాద్‌నగర్‌ నుంచి ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి దరఖాస్తు చేసుకోగా, ఒకే కుటుంబానికి రెండు సీట్లు కేటాయించే అవకాశాలు లేవని స్పష్టమైంది. తొలి జాబితా ఖరారుకు ముందే తాను లోక్‌సభకే పోటీచేస్తానని, మహబూబ్‌నగర్‌ సీటును తన కుమారుడికి కేటాయించాలని జితేందర్‌ కోరడాన్ని జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

ఐతే ఈ ఒక్క సీటుకోసం జాబితా ఇవ్వకుండా మిథున్‌కు టికెట్‌పై భరోసా ఇచ్చి మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే సరిపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈవిధంగా జితేందర్‌రెడ్డి తన పంతం నెగ్గించుకోవడంతో మరికొందరు కూడా ఇలాగే తాము అసెంబ్లీకి కాకుండా లోక్‌సభకే పోటీ చేస్తామనే డిమాండ్‌ను ప్రోత్సహించినట్లవుతుందని అంటున్నారు. 

రెండో సీట్లో పోటీకి సంజయ్‌ సై? 
హుజూరాబాద్, గజ్వేల్‌ నుంచి పోటీకి ఈటలకు అవకాశమిచ్చినందున తనకూ కరీంనగర్‌తోపాటు వేములవాడలోనూ పోటీకి అవకాశం ఇవ్వాలని బండి సంజయ్‌ కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదేకాకుండా సంగారెడ్డి సీటును దేశ్‌పాండేకు ఇవ్వాలని సంజయ్‌ కోరుతుండగా, పులిమామిడి రాజుకు ఇవ్వాలని ఈటల పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి పోటీ చేయడానికి కిషన్‌రెడ్డి విముఖత వ్యక్తం చేస్తుండటంతో అంబర్‌పేట నుంచి ఎవరిని బరిలో నిలుపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి నగర సెంట్రల్‌ పార్టీ అధ్యక్షుడు డా.ఎన్‌.గౌతంరావును బరిలో దింపుతారా లేక బీసీకి ఇవ్వాలనే యోచనతో మాజీ ఎమ్మెల్యే సి.కృష్ణాయాదవ్‌కు అవకాశం కల్పిస్తారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.  

మిగిలిన సీట్లపై కసరత్తు 
మరో 45 స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్, సహఇన్‌చార్జి సునీల్‌ బన్సల్, రాష్ట్ర ముఖ్య నేతలు కిషన్‌రెడ్డి, డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్‌ శుక్రవారం కసరత్తు చేసినట్లు తెలిసింది. మలి జాబితాను నవంబర్‌ 1న ప్రకటిస్తారని అంటున్నారు. జనసేనకు ఆరుదాకా సీట్లు కేటాయించే అవకాశం ఉండటంతో వాటిని మినహాయించి... మిగిలిన సీట్లలో జాబితా ప్రకటించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.

మరిన్ని వార్తలు