పాలమూరు కాంగ్రెస్‌లో టికెట్‌ ప్రకంపనలు..

5 Nov, 2023 19:59 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : పాలమూరు కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టిక్కెట్లు ఆశించి భంగపడినవారు హస్తం గూటిని వీడుతున్నారు. రాత్రికి రాత్రే కొందరు అసమ్మతి నేతలు కండువాలు మార్చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి సొంత జిల్లాలో ఆయనకు షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ వచ్చిన సమయంలోనే నాగం జనార్థనరెడ్డి గులాబీ కండువా  కప్పుకున్నారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో కారు పార్టీలో జోష్ పెంచుతోంది. పాలమూరు రాజకీయాలు వస్తున్న మార్పులు ఏంటి ? 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసంతృప్త నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీకి గుడ్‌బై చెప్పి కారెక్కుతున్నారు. ఈ పరిణామాలు వేగంగా సాగుతుండటంతో జిల్లా రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి. ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత కాంగ్రేస్‌ పార్టీలో చేరటంతో గులాబీ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. జూపల్లి కృష్ణారావు సైతం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కాంగ్రేస్‌లో చేరిపోయారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులకు సంబంధించి మొదటి జాబితాలో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌, గద్వాల సీట్లు ఆశించిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి దక్కడంతో నాగం జనార్థనరెడ్డి, జగదీశ్వరరావులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నాగం ఇప్పటికే కేసీఆర్‌ సమక్షంలో గులాబీ పార్టీలో చేరిపోయారు. మరికొందరు నేతలు కూడా తమ అనుచరుతలతో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. 

తనకు సీటు రాకపోవటంతో ఆగ్రహంగా ఉన్న నాగంకు అధికార పార్టీ నేతలు గాలం వేశారు. మత్రులు కేటీఆర్‌..హరీష్ రావులు నాగంను కలిసి మంతనాలు జరపడం.. పార్టీలోకి ఆహ్వానించటం అందుకు ఆయన సమ్మతించటం ...వెంటనే నాగం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలవటం చకచకా సాగిపోయాయి. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ కూడా టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించారు. ఎర్ర శేఖర్‌కు జడ్చర్ల కాకుండా చివర్లో నారాయణపేట నుంచి పోటీచేయాల్సిందిగా పార్టీ పెద్దలు సూచించారు. ఎర్ర శేఖర్‌ అందుకు నిరాకరించారు. చివరికి ఎర్ర శేఖర్‌ను నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.ఆర్‌ రెడ్డి సంప్రదించి..కేటీయార్‌ సమక్షంలో పార్టీలో చేర్చుకున్నారు. వనపర్తిలో సీటు ఆశించి భంగబడ్డ మెగారెడ్డికి మద్దతుగా వనపర్తిలో కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని మెగారెడ్డికి ఆయన అభిమానులు సూచించారు. మీ అభిష్టం మేరకే నడుచుకుంటానని మెగారెడ్డి ప్రకటించారు. 

దేవరకద్ర నుంచి సీటు ఆశించిన కొండా ప్రశాంత్‌రెడ్డి సైతం తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళం నిర్వహించారు. కాంగ్రేస్ అభ్యర్ది మధుసూధన్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. మరోవైపు సోమవారం నాడు దేవరకద్ర అభ్యర్థిని మార్చాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో విధ్వంసం సృష్టించారు. మక్తల్‌ సీటు ఆశించిన నేత కూడా అనుచరులతో మాట్లాడి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. ఇలా ఎక్కడికక్కడ అసంతృప్త నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇలా అన్ని చోట్లా రెబల్స్‌ బరిలో దిగితే కాంగ్రేస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంటుందని పార్ఠీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్న వేళ తాజా ఘటనలు నేతల్ని కలవరపెడుతున్నాయి. స్వంత జిల్లాలో అధిక స్దానాలు గెలవాలని  భావించిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి నేతలు పార్టీని వీడటం తలనొప్పిగా మారింది.

ఇన్నాళ్లూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాస్త వెనకబడిందనుకున్న అధికార పార్టీకి ఒకేరోజున పెద్దస్థాయిలో కలిసి వచ్చింది. బీజేపీ నేత పి.చంద్రశేఖర్‌..కాంగ్రెస్ నేతలు నాగం జనార్థనరెడ్డి, ఎర్ర శేఖర్‌లు గులాబీ పార్టీలో చేరడం వారికి సముచిత స్థానం ఉంటుందన్న సంకేతాలు పార్టీ పెద్దలు ఇస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెరుగుతోంది. ఇటీవలే..వనపర్తికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు..మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడ బీఆర్ఎస్ పార్టీలో చేరటం బీయారెస్‌కు కలిసివచ్చే అంశాలుగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్ నేతల్ని బీఆర్ఎస్ నాయకత్వం వెంటనే సంప్రదించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీల్లోకి నాయకుల రాకపోకలతో కింది స్థాయి వరకు మార్పులు జరుగుతాయా? లేక అక్కడితో ఆగిపోతాయా? అనేది చూడాలి.
 

మరిన్ని వార్తలు