సీడ్‌ పార్క్‌ సూత్రధారి.. పెద్ద మోసకారి!

4 Oct, 2017 07:31 IST|Sakshi
సీఎం చంద్రబాబుతో దిలీప్‌ (ఫైల్‌)

దిలీప్‌ గుంటుకను నమ్మొద్దు

సహ ఉద్యోగినిని వేధించి ఆత్మహత్యకు కారణమయ్యాడు

ఇక్రిశాట్‌లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు

అనంతరం ఐయోవా యూనివర్సిటీలో తేలిన దిలీప్‌

సీఎస్‌ మొదలు ముఖ్యమంత్రి వరకు ఫిర్యాదుల వెల్లువ  

సాక్షి, అమరావతి:  కర్నూలు జిల్లా తంగడంచలో తలపెట్టిన ప్రతిష్టాత్మక సీడ్‌ పార్క్‌ (విత్తన భాండాగారం) సూత్రధారి పెద్ద మోసకారా? తన మాతృసంస్థ ఇక్రిశాట్‌లో మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించి ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యారా? ఆర్థిక అవకతవకలతో ఇక్రిశాట్‌ను మోసగించారా? అవుననే అంటున్నారు పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు. విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తిని సీడ్‌పార్క్‌ భాగస్వామిగా తీసుకోవడం ఏమాత్రం తగదంటున్నారు. అతని వ్యక్తిగత చరిత్ర యావత్తు మోసం, దగాలతో కూడుకున్నదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి మొదలు ప్రధాని వరకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని నమ్మి ప్రతిష్టాత్మక, బహుళ ప్రయోజక సంస్థ ఏర్పాటు బాధ్యతను అప్పగించడమంటే రైతన్నకు కీడు చేయడమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరీ సూత్రధారి?: పేరు గుంటుక దిలీప్‌ కుమార్‌.. ఏపీకి చెందిన వ్యక్తి. గుజరాత్‌లోని ధీరూభాయ్‌ అంబానీ ఇనిస్టిట్యూట్‌ నుంచి ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు. హైదరాబాద్‌ శివార్లలోని ఇక్రిశాట్‌లో నాలెడ్జ్‌ షేరింగ్, ఇన్నోవేషన్‌ (విజ్ఞాన మార్పిడి, నూతన ఆవిష్కరణలు) గ్లోబల్‌ లీడర్‌గా చేరిన తర్వాత ఆయన అనేక ఆరోపణలను ఎదుర్కొన్నారు. అందులో సహచర మహిళా శాస్త్రవేత్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నది ప్రధానమైంది. దీనిపై ఆమె 2014లో ఫిర్యాదు చేసి, న్యాయవాది కె.వివేక్‌రెడ్డి ద్వారా నోటీసులు పంపారు. ఆ తర్వాత స్వరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దిలీప్‌ చేసిన తప్పుడు ప్రచారమే కారణం అని ఆనాడు పలువురు ఉద్యోగులు ఆరోపించారు.

ఆర్థిక అవకతవకలెన్నో....
దీంతోపాటు ఆయన అనేక ఆర్థిక అవకతవకలకూ పాల్పడ్డట్టు ఇక్రిశాట్‌ అంతర్గత ఆడిటర్లు నిగ్గుతేల్చారు. ఇక్రిశాట్‌ తరఫున హాజరు కావాల్సిన సదస్సులకు వెళ్లకుండానే వెళ్లినట్టు టిక్కెట్లు, హోటల్‌ బిల్లులు వంటివి పుట్టించి ఆర్థిక నేరానికి పాల్పడినట్లు ఆరోపించింది. వీటిపై సమాధానం ఇవ్వకపోతే ఉద్యోగం నుంచి తీసివేయాల్సి వస్తుందని ఆనాటి ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ రాతపూర్వకంగా నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో ఇక్రిశాట్‌కు రాజీనామా (2015 జూన్‌లో) చేసి ఓ డైరెక్టర్‌ సహకారంతో అమెరికాలోని ఐయోవా యూనివర్సిటీలో తేలాడు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం సీడ్‌ పార్క్‌ ఏర్పాటు కోసం ఐయోవాతో ఎంవోయూ కుదిర్చుకుంది. వాస్తవానికి వాగెనిజెన్‌ యూనివర్సిటీ, క్వీన్స్‌లాండ్‌ వర్శిటీలు విత్తనాభివృద్ధిలో ఐయోవా కన్నా చాలా ముందున్నాయి.  ఇలాంటి వ్యక్తిని మీరు సీడ్‌ పార్క్‌ వ్యూహాత్మక భాగస్వామిగా తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరమని ఉద్యాన వన వర్సిలో సీనియర్‌ శాస్త్రవేత్తగా పని చేసి పదవీ విరమణ చేసిన ఓ ప్రొఫెసర్‌ సీఎంకు రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం.  మెగా సీడ్‌ పార్కుకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఇటువంటి మచ్చపడిన వ్యక్తులను తప్పించాలని పలువురు వ్యవసాయ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఏమిటీ సీడ్‌ పార్క్‌?
వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లా తంగడంచలో దేశంలోనే తొలి విత్తన భాండాగారం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సుమారు 500 ఎకరాల్లో ఈ కేంద్రం ఏర్పాటు అవుతుంది. ఈ కేంద్రానికి అవసరమైన సాంకేతిక సహకారాన్నీ, సమాచారాన్నీ అమెరికాకు చెందిన ఐయోవా విశ్వవిద్యాలయం అందిస్తే రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఈమేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీనిపై ఐయోవా విశ్వవిద్యాలయం సీడ్‌ సైన్స్‌ సెంటర్‌ గ్లోబల్‌ ప్రోగ్రాం లీడర్‌ దిలీప్‌ సంతకాలు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు