ఓవర్‌ టు మహారాష్ట్ర!

29 Oct, 2018 10:00 IST|Sakshi

ముంబైకి చేరిన డాక్టర్‌ నౌహీరా షేక్‌ వ్యవహారం

‘మేనేజ్‌మెంట్‌’పై ఆమె అనుచరుల ప్రధాన దృష్టి

రికార్డులు ఇవ్వవద్దంటూ ఇప్పటికే సీసీఎస్‌ పిటీషన్‌

సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా రూ.వందల కోట్ల స్కామ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నౌహీరా షేక్‌ ఎపిసోడ్‌ తాత్కాలికంగా మహారాష్ట్రకు మారింది. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు ఆమెను అరెస్టు చేయడం, నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేయడం, జైలు నుంచి విడుదల కావడంతో ఇక్కడి సీన్‌ ముగిసింది. శుక్రవారం జైలు వద్దే అదుపులోకి తీసుకున్న ముంబై ఎకనామికల్‌ ఆఫెన్సెస్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) అధికారులు ఆమెను అక్కడికి  తరలించారు. ముంబైకి చెందిన షైనే ఇల్లాహి షేక్‌ అనే వ్యక్తి తాను హీరా గ్రూప్‌లో రూ.8 లక్షల పెట్టుబడి పెట్టానని, 2.8 నుంచి 3.2 శాతం వడ్డీ ఇస్తామంటూ ప్రకటించి మోసం చేశారని ఈ నెల 23న అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అక్కడి జేజే మార్గ్‌ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును దర్యాప్తు నిమిత్తం ఈఓడబ్ల్యూకు బదిలీ చేశారు. హైదరాబాద్‌ నుంచి అరెస్టు చేసి తీసుకువెళ్లిన నౌహీరాను ప్రాథమికంగా ఈ కేసులోనే అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం శనివారం వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.

హీరా గ్రూప్‌ విక్టిమ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, నగరానికి చెందిన షాబాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ సహకారంతోనే ముంబైలోనూ బాధితులు ఫిర్యాదులు చేశారు. మహారాష్ట్రలోని అనేక ఠాణాల్లో ఈమెపై పలు కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల మంది... ఒక్క ముంబైలోనే పది వేల మంది బాధితులు ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమెపై నమోదైన కేసుల నేపథ్యంలో పీటీ వారెంట్లపై ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల పోలీసులు తీసుకువెళ్లే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ఆమె అనుచరులు కీలక ఎత్తులు వేస్తున్నారు. డిపాజిట్‌దారులు, బాధితుల వివరాలు సేకరించి వారికి నగదు చెల్లిస్తూ సెటిల్‌మెంట్స్‌ చేస్తూ కేసులను మేనేజ్‌ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది. అసలు బాధితుడే ముందుకు రాకుంటే పోలీసులు సైతం ఏమీ చేయలేరన్నది వీరి ఉద్దేశం. ఓ నిందితుడిని అరెస్టు చేసినప్పుడు పోలీసులు వారిని కోర్టులో హాజరుపరుస్తారు.

ఆ సమయంలో బాధితులు, సాక్షులుగా ఉన్న నష్టపోయిన వారి వివరాలు పొందపరుస్తారు. డిఫెన్స్‌ లాయర్ల సాయంతో వీటిని సంగ్రహిస్తున్న నౌహీరా అనుచరులు వారిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఆ బాధితులకు పూర్తి మొత్తం చెల్లిస్తే కేసే ఉండదని, ఇతర అంశాలు వెలుగులోకి రావని పథకం వేస్తున్నారు. దీనిని గుర్తించిన సీసీఎస్‌ పోలీసులు ఇప్పటికే తాము దాఖలు చేసే జాబితాలు నిందితురాలితో పాటు ఆమె తరఫు వారికీ అందించవద్దని కోర్టును కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ముంబై అధికారులూ ఇదే బాటలో వెళ్లాలని యోచిస్తున్నారు. మరోపక్క సీసీఎస్‌ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన కేరళలోని సువన్‌ టెక్నాలజీస్‌ సంస్థ డైరెక్టర్‌ బిజు థామస్‌ను అరెస్టు చేశారు. ఇతడిని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. హీరా గ్రూప్‌నకు థామస్‌ను లోతుగా విచారించిన నేపథ్యంలో అనేక కీలక సాంకేతిక అంశాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

థామస్‌ కస్టడీకి అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. మరోపక్క త్వరలో థామస్‌ను సైతం ముంబై పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లే అవకాశం ఉంది. మరోపక్క హీరా గ్రూప్‌పై సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని కూకట్‌పల్లి ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. రూ.10 లక్షలు కోల్పోయిన ఇద్దరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీటిని నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు