నెత్తురోడిన రహదారులు.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి

11 Nov, 2023 08:46 IST|Sakshi

దేశంలో రహదారులు మృత్యు ద్వారాలను తలపించాయి.. వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మెుత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు

సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరువత్తూర్ జిల్లా వానియంబాడి రహదారిపై శనివారం తెల్లవారుజామున రెండు ప్రైవేటు ట్రావెల్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోనూ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గురుగ్రామ్‌ సమీపంలోని ఢిల్లీ-జైపూర్‌ జాతీయ రహదారిపై వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా వేగంగా దూసుకొచ్చి కారును, మరో వ్యాన్‌ను బలంగా ఢకొట్టింది. దీంతో ఆయిల్‌ ట్యాంకర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు కారుకు సైతం అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్‌ డ్రైవర్‌ కూడా అక్కడికికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటన తర్వాత ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ పరారయ్యాడని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ట్యాంకర్‌లో సీఎన్‌జీ సిలిండర్‌లు ఉండటంతో మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు.
చదవండి: టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి

మరిన్ని వార్తలు