మార్ఫింగ్‌ షేక్‌

12 Nov, 2018 11:35 IST|Sakshi

వెలుగులోకి వస్తున్న నౌహీరా షేక్‌ లీలలు

ఫొటోషాప్‌తో మార్ఫింగ్‌ మాయ

బాధితుల జాబితాలో ముంబై పోలీసులు కూడా..  

దర్యాప్తు ముమ్మరం చేసిన సీసీఎస్‌ అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ముసుగులో స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన నౌహీరా షేక్‌ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈమె తన సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లో తనకు అనేక అవార్డులు వచ్చినట్లు వివరాలు పొందుపరిచారు. తన కార్యాలయంతో పాటు సోషల్‌ మీడియాలోనూ వాటికి సంబంధించిన అనేక ఫొటోలను అప్‌లోడ్‌ చేశారు. వీటిలో అనేక అవార్డుల పేర్లు ఇప్పటి వరకు ఎక్కడా వినపడలేదు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తులో భాగంగా ఈ కోణం పైనా పోలీసులు దృష్టి పెట్టారు. ఫలితంగా నౌహీరా షేక్‌ తనకు రాని అవార్డులు సైతం వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని తేలింది. మరోపక్క ముంబైలో ఈ గ్రూప్‌పై నమోదైన కేసులను అక్కడి ఆర్థిక నేరాల దర్యాప్తు ప్రత్యేక విభాగమైన ఎకనామికల్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈఓడబ్ల్యూ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి పరిశీలనలో బాధితుల జాబితాలో కొందరు పోలీసులు సైతం ఉన్నట్లు గుర్తించారు. 

అక్కడి ఫొటో ‘ఇక్కడ’ వాడుతూ..
హీరా గ్రూప్‌ అధికారిక వెబ్‌సైట్‌లోని అచీవ్‌మెంట్స్‌ లింకులో నౌహీరా సాధించిన విజయాలుగా చెబుతూ చాంతాడంత జాబితా ఉంది. ఇందులో అనేక అవార్డుల పేర్లు, వాటి వివరాలను ఉంచారు. దీని ప్రకారం నౌహీరాకు 2012 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు ప్రదానం చేసినట్లు ఉంది. అంతేకాదు.. మొత్తం 11 రకాలైన జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తన జాబితాలో వేసుకుంది. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలను నౌహీరా సోషల్‌ మీడియాతో పాటు తన కార్యాలయం, ఇళ్లల్లో ప్రదర్శించేశారు. వీటిని విశ్లేషించిన దర్యాప్తు అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. దుబాయ్‌ యువరాణి ఫైజల్‌ అల్‌ ఖసీమీ తనకు ‘టాప్‌ బిజినెస్‌ ఉమెన్‌ అవార్డు’ ప్రదానం చేసినట్లు ఆమె ఓ ఫొటో రూపొందించారు. అయితే, వాస్తవానికి దుబాయ్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఖసీమీని కలిసిన నౌహీరా ఆమెతో కలిసి ఫొటో  దిగారు. ఆపై దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఫొటోషాప్‌ ద్వారా తనకు ఆమె టాప్‌ అవార్డు ఇస్తున్నట్లు సృష్టించేశారు. 2014లో సుష్మాస్వరాజ్‌ తన దుబాయ్‌ పర్యటనలో భాగంగా ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ఫొటోను సేకరించిన నౌహీరా ఫొటోషాప్‌ వినియోగించి ఆ కార్యక్రమంలో తానూ స్టేజ్‌ మీద ఉన్నట్టు సృష్టించేసింది. ఇలా ఇంకా అనేక ఫొటోలను మార్ఫింగ్‌ చేసి తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

కస్టమర్లను ఆకర్షించేందుకు, భయపెట్టేందుకు..
హీరా గ్రూప్‌ ముసుగులో స్కాములకు శ్రీకారం చుట్టిన నౌహీరా షేక్‌ ఈ ఫొటోలను రెండు రకాలుగా వాడుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత వీటిని ఎరవేసి తన గ్రూప్‌ ఇమేజ్‌ను పెంచుకోవడం ద్వారా డిపాజిట్‌దార్లను ఆకర్షించారని భావిస్తున్నారు. మరోపక్క డిపాజిట్‌ చేసిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ఎవరైనా ఒత్తిడి చేస్తే తనకు పైస్థాయిలో పరిచయాలు, పలుకుబడి ఉందంటూ వారిని భయపెట్టడానికీ వాడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు కోణాల్లోనూ నౌహీరాను ప్రశ్నించాలని యోచిస్తున్నారు. మరోపక్క నౌహీరా షేక్‌ తన పేరు ముందు తగిలించుకున్న ‘డాక్టర్‌’ను పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన నౌహారా షేక్‌ తండ్రి సాధారణ కూరగాయల వ్యాపారి. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన నౌహీరా ప్రస్తుతం తన పేరుకు ముందు ‘డాక్టర్‌’ను తగిలించుకున్నారు. ఈ డాక్టరేట్‌ ఈమెకు దుబాయ్‌కు చెందిన ఓ యూనివర్శిటీ ఇచ్చిందంటూ అనుచరులు ప్రచారం చేస్తున్నా.. పోలీసులు మాత్రం దీన్ని విశ్వసించట్లేదు. అవార్డుల మాదిరిగానే ఇదీ ఓ స్కామ్‌గా అనుమానిస్తున్నారు. సదరు డాక్టరేట్‌పై ఎలాంటి ఆధారాలు లభించలేదని, నౌహీరా నుంచీ సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు. 

టెక్నాలజీతో తేలనున్న నిజం  
నౌహీరా షేక్‌ను సిటీ సీసీఎస్‌ పోలీసులు అక్టోబర్‌ 16న అరెస్టు చేశారు. ఆపై ముంబైలోని ఈఓడబ్ల్యూ అధికారులు పీటీ వారెంట్‌పై అక్కడకు తీసుకెళ్లారు. నాటి నుంచి ఈఓడబ్ల్యూ అధికారులను దాదాపు 150 మంది బాధితులు సంప్రదించారు. వీటిలో కొన్ని కేసులుగా నమోదయ్యాయి. బాధితుల జాబితాలో ముంబైకి చెందిన కొందరు పోలీసు అధికారులు ఉన్నట్లు తెలిసింది. డిపాజిట్లపై సరాసరిన 36 నుంచి 42 శాతం వడ్డీ ఎర చూపడంతో నలుగురు అధికారులు రూ.20 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టారని సమాచారం. ఒక్క మహారాష్ట్రలోనే హీరా గ్రూప్‌ స్కామ్‌ రూ.1000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో అక్షరాలా రూ.5 వేల కోట్ల టర్నోవర్‌ చేసిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ గుట్టును సాంకేతికంగా విప్పాలని సీసీఎస్‌ పోలీసులు నిర్ణయించారు. గత వారం ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సీసీఎస్‌ పోలీసులు సర్వర్‌తో పాటు హార్డ్‌ డిస్క్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించడం ద్వారా కీలక సమాచారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు