నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి..దంపతుల ఆత్మహత్య

18 Nov, 2023 08:35 IST|Sakshi

ముషీరాబాద్‌లోని గంగపుత్ర కాలనీలో విషాదం

బౌద్ధనగర్‌: ‘మేము చావడానికి కారణం ఆ నలుగు రే. వారిని విడిచిపెట్టకండి’అని సూసైడ్‌ నోట్‌ రాసి నాలుగేళ్ల కూతురుతో సహా దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా లక్ష్మీపురానికి చెందిన కొప్పుల సాయికృష్ణ (37), చిత్రకళ(30) దంపతులు. వీరికి తేజస్వి అనే నాలుగేళ్ల పాప ఉంది.

ఏడాది నుంచి ముషీరాబాద్‌ గంగపుత్ర కాలనీలో నివసిస్తున్నారు. సాయికృష్ణ గతంలో ర్యాపిడో బైక్‌ నడిపేవాడు. ఏడాదిగా ఉద్యోగానికి వెళ్లడం లేదు. భార్య చిత్రకళ నాంపల్లి బిర్లా సైన్స్‌ సెంటర్‌లోని టికెట్‌ కౌంటర్‌లో ఉద్యో గం చేస్తుండేది. అయితే అపాయింట్మెంట్‌ ఆర్డర్, పే స్లిప్‌ అడిగిన నేపథ్యంలో నెలక్రితం ఆమెను  ఉద్యోగం నుంచి తొలగించారు. భర్తకు పని లేకపోవడం, తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేని చిత్రకళ తీవ్ర మనోవేదనకు గురైంది.

లేనిపోని కారణాలు చూపి తనను ఉద్యోగం నుంచి తొలగించిన నలుగురు ఉద్యోగులు శ్యాం కొటారి, గాతా, హరిబాబు, సంతోష్‌ రెడ్డిలను వదిలిపెట్టవద్దని సూసైడ్‌ నోట్‌లో రాసి ఆ నోట్‌ను గోడకు అతికించింది. ముందుగా కూతురుకి ఉరేసి.. ఆ తర్వాత భార్య, భర్త కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి వారున్న ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పక్కింటి వాళ్లు తలుపులు కొట్టారు. అయినా తీయలేదు. శుక్రవారం ఉదయం ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి తలుపులు బద్దలుగొట్టి చూడగా ముగ్గురూ విగతజీవులై కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. 

మృతిపై అనుమానాలు: బిర్లా సైన్స్‌ సెంటర్‌లో పలు అవకతవకలు జరిగాయని, వాటి గురించి తనకు తెలియడం వల్లనే  శ్యామ్‌ కొఠారి, గీతారావు, హరిబాబు, సంతోష్‌ రెడ్డిలు కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేసి ఉద్యోగం నుంచి తొలగించారని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. తాను పని చేసిన కార్యాలయంలో రూ.కోట్లలో మోసం జరిగిందని పేర్కొంటూ 12 పాయింట్లతో సూసైడ్‌ నోట్‌ రాసి గోడకు అతికించింది. ‘‘ఓ మంత్రితో మాట్లాడేందుకు యత్నించినా కుదరలేదు. ఓ టీవీకి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చినా స్పందించ లేదు.’’ అని అందులో పేర్కొంది. అయితే ఆఫీసులో జరిగిన దానికి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు