న్యాయం చేయాలంటూ హిజ్రాల ఆందోళన

1 Oct, 2018 09:45 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న హిజ్రాలు

బంజారాహిల్స్‌: నెలవారి మామూళ్లు ఇవ్వడం లేదంటూ అర్ధరాత్రి దౌర్జన్యంగా హిజ్రాలు నిద్రిస్తున్న గదిలోకి ప్రవేశించి, కత్తులతో బెదిరించి అలమారాలో ఉన్న రూ.2 లక్షల నగదు, బంగారు నగలతో ఉడాయించిన రౌడీషీటర్‌ వెంకట్‌ యాదవ్‌తో పాటు సనత్‌నగర్‌ పహిల్వాన్‌ సాయిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2 లోని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వెనకాల ఇందిరానగర్‌లో యాస్మిన్‌(28) అనే హిజ్రా సహచర హిజ్రాలతో కలిసి నిద్రిస్తున్నది. ఈ నెల 27వ తేదీన రౌడీ షీటర్‌ వెంకట్‌యాదవ్, సనత్‌నగర్‌ పహిల్వాన్‌ సాయి ఇద్దరూ ఆమె ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. ప్రతినెలా తమకు ఇచ్చే రూ.10 వేల మామూళ్ళు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తూనే ఆమెను తీవ్రంగా కొట్టారు.

అక్కడే ఉన్న ఆమె 17 నెలల కూతురిని కూడా హత్య చేస్తామంటూ బెదిరించారు. బలవంతంగా ఆమె దగ్గరి నుంచి అలమారా తాళంచెవులు తీసుకొని అందులో ఉన్న రూ.2 లక్షల నగదు, బంగారాన్ని తీసుకోవడమే కాకుండా ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అంతు చూస్తామంటూ బెదిరించారు. నిందితులు అక్కడి నుంచి పరారు కాగానే బాధితురాలు ఈ విషయాన్ని సహచర హిజ్రాలకు తెలియజేసింది. సమాచారం అందుకున్న వివిధ ప్రాంతాల హిజ్రా గ్రూపులు శనివారం రాత్రి 10 గంటలకు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ నెల27వ తేదీన తాము పిర్యాదు చేస్తే ఇప్పటిదాకా వెంకట్‌ యాదవ్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదంటూ బాధితురాలు యాస్మిన్‌తో పాటు సనం, సోనా రాథోడ్, సనా, ప్రియా, లక్కీ, అలేఖ్య, లిప్సిక తదితరులు స్టేషన్‌ ముందు బైఠాయించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు పెద్దసంఖ్యలో హిజ్రాలు విచ్చేసి స్టేషన్‌ ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌ ఏసీపీ కే.ఎస్‌.రావు, ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ పరిస్థితిని సమీక్షించారు. నిందితుల జాడ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు