బంజారాహిల్స్‌లో భారీ చోరీ

10 Dec, 2019 03:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రూ. కోటి విలువ చేసే ఆభరణాలతో ఉడాయించిన పనిమనిషి

బంజారాహిల్స్‌: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పనిమనిషి ఉన్నదంతా ఊడ్చుకుని పరారయ్యాడు. వివరాలు.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం 12లోని అంకుర్‌ ఆస్పత్రి సమీపం లో వ్యాపారి కపిల్‌గుప్తా నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ఓ శుభకార్యానికి కుటుంబసభ్యులతో కలసి వెళ్లారు. తిరిగి సోమ వారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటిలోకి వెళ్లిచూడగా బెడ్‌రూంలో బీరువా తాళాలు పగులగొట్టి ఉండటమే కాకుండా ఆభరణాల బాక్సులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే బంజారాహిల్స్‌ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. తమ ఇంట్లో నెలన్నర క్రితం బిహార్‌కు చెందిన రామ్‌(29) అనే వ్యక్తిని పనిమనిషిగా నియమించుకున్నామని పోలీసులకు తెలిపారు.

పెళ్లికి వెళ్తూ ఇంటి బాధ్యతలను పనిమనిషికి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇదే అదనుగా భావించిన రామ్‌ బీరువాలోని రూ.5.70 లక్షల నగదు, రూ.కోటి విలువ చేసే బంగారు వజ్రాభరణాలను చోరీ చేసి ఇంటికి తాళంవేసి తాళం చెవులను గేటు వద్ద పెట్టి ఉడాయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో కపిల్‌గుప్తా మేనల్లుడు ఇంటికి వచ్చి డ్రెస్‌ మార్చుకుని వెళ్లాడు. ఆ తర్వాతే చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. నిందితుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు సదరు యజమాని తీసుకోలేదు. నిందితుడి ఫొటోలు కూడా యజమాని వద్దలేకపోవడంతో దర్యాప్తునకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

మరిన్ని వార్తలు