‘సింథటిక్‌’తో సింపుల్‌గా దోచేశారు..

31 Jan, 2019 03:08 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న నకిలీ వేలిముద్రలను మీడియాకు చూపెడుతున్న విశ్వజిత్‌ కంపాటి

జీహెచ్‌ఎంసీలో భారీ కుంభకోణం 

నకిలీ వేలి ముద్రలతో పారిశుధ్య కార్మికుల హాజరు నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పారిశుధ్య కార్మికుల హాజరులో శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. కార్మికుల బయోమెట్రిక్‌ హాజరులో అక్రమాలు జరిగినట్లు తేలింది. నకిలీ (సింథటిక్‌) వేలిముద్రలు తయారు చేసి వాటితో పారిశుధ్య కార్మికులు హాజరు కాకపోయినా హాజరు వేసి వారి వేతనాలు కాజేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తనిఖీలు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం చాలా కాలంగా జరుగుతున్న గుట్టును రట్టు చేసింది. ఏకంగా 84 మంది నకిలీ వేలి ముద్రలను స్వాధీనం చేసుకున్నారు. 

9 మందిపై వేటు.. క్రిమినల్‌ కేసులు.. 
జీహెచ్‌ఎంసీలో నకిలీ వేలిముద్రలతో పారిశుధ్య కార్మికుల హాజరు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ విభాగం బృందాలు దాదాపు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి హైదరాబాద్‌లోని 12 ప్రాంతాల్లో ఎస్‌ఎఫ్‌ఏలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. 84 కృత్రిమ (సింథటిక్‌) వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం)డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తెలిపారు. 17 మంది ఎస్‌ఎఫ్‌ఏలను తనిఖీ చేయగా, 9 మంది వద్ద ఈ నకిలీ ఫింగర్‌ ప్రింట్స్‌ను గుర్తించినట్లు తెలిపారు.   9 మంది ఎస్‌ఎఫ్‌ఏలను విధుల నుంచి తొలగించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. నకిలీ వేలిముద్రలతోపాటు 12 బయోమెట్రిక్‌ మెషీన్లను స్వాధీనం చేసుకున్నారు. 

పది రూపాయల్లోపే తయారీ: కొవ్వొత్తిని కాల్చగా వచ్చిన ద్రవాన్ని అట్టముక్కపై వేస్తారు. కొద్దిగా ఆరిన ద్రవంపై వేలిముద్ర వేయిస్తారు. తర్వాత కొంచెం ఫెవికాల్‌ వేస్తారు. అది గట్టిపడ్డాక దిగువనున్న పేపర్‌ను తొలగిస్తే ఫింగర్‌ప్రింట్‌ మిగులుతుంది. దీనితో బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేస్తున్నారు. నకిలీ వేలిముద్రల ద్వారా భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి తయారీకి రూ.5 నుంచి రూ.10 లోపే ఖర్చు కావడం గమనార్హం. బయోమెట్రిక్‌ హాజరును ఆధార్‌ అనుసంధానంతో పాటు జీపీఎస్‌నూ జత చేయడంతో అవకతవకలకు పాల్పడే వీలుండదని భావించిన అధికారులు.. తాజా ఉదంతంతో ఖంగు తిన్నారు.

2017 మేలో జీహెచ్‌ంఎసీ బయోమెట్రిక్‌ హాజరు ప్రారంభించింది. ఒక్క నెలలోనే రూ.2.86 కోట్లు మిగులు కనిపించింది. విధులకు గైర్హాజరైన వారిపేరిట జరిగిన స్వాహా అది. అలా ఏడాదికి రూ.35 కోట్ల మిగులు కనిపించింది. మే 21 నుంచి జూన్‌ 20 వరకు బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించారు. దీంతో ఒక్క నెలలోనే రూ.2,86,34,946 తేడా కనిపించింది. బయోమెట్రిక్‌ హాజరు లేనప్పుడు 2016 డిసెంబర్‌ 21 నుంచి 2017 జనవరి 20 వరకు రూ.34,64,22,282 వేతనాలుగా చెల్లించగా, బయోమెట్రిక్‌ హాజరు అమలు చేశాక 2017 మే 21 నుంచి జూన్‌ 20 వరకు రూ.31,77,87,336 మాత్రమే చెల్లించారు.

అధికారులపై చర్యలు: మేయర్‌ 
పారిశుధ్య కార్మికుల బోగస్‌ హాజరు నమోదు చేస్తున్న 9 మంది ఎస్‌ఎఫ్‌ఏలను విధుల నుంచి తొలగించి వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా మేయర్‌ బొంతురామ్మోహన్‌ అధికారులను ఆదేశించారు.  

మరిన్ని వార్తలు