బల్దియాలో పనులకు బ్రేక్‌

4 Oct, 2023 08:42 IST|Sakshi

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో ప్రాజెక్టుల పరిధిలోని పనులు మినహా ఇంజినీరింగ్‌ పనుల్ని కాంట్రాక్టర్లు చాలా ప్రాంతాల్లో నిలిపివేశారు. ఇప్పటికే రూ.800 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పాటు మంజూరైన పనులు మరో రూ. 3వేల కోట్లున్నాయని కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ సభ్యులు పేర్కొన్నారు. ఎంతోకాలంగా బిల్లులు చెల్లించాల్సిందిగా మంత్రి నుంచి చీఫ్‌ సెక్రటరీ, కమిషనర్‌దాకా అందరినీ కలిసి విన్నవించినా తమ బాధలు ఎవరూ పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పనులు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

అక్టోబర్‌ 1 నుంచే పనులు నిలిపివేయనున్నట్లు ఇప్పటికే ఎన్నో పర్యాయాలు తెలిపినా, అధికారుల నుంచి స్పందన రాలేదన్నారు. ఒకటి, రెండు తేదీల్లో జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు సెలవులు కావడంతో మంగళవారం జోనల్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమ బిల్లుల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. శ్రీనో పేమెంట్‌– నోవర్క్‌శ్రీ స్లోగన్లు చేశారు. బ్యానర్లు ప్రదర్శించారు. వెయ్యికోట్లే చెల్లించలేకపోతున్న వారు రూ. 4వేల కోట్ల పనులు చేస్తే వాటినిచ్చేందుకు ఎన్నేళ్లు కావాలని ప్రశ్నించారు.

వీటిని వివరిస్తూ తుది దశలో ఉన్న పనుల్ని మాత్రం పూర్తిచేసి, మిగతా పనుల్ని చేయవద్దని, కొత్త టెండర్ల జోలికి అసలే పోవద్దని కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ సభ్యులు జీహెచ్‌ఎంసీలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లందరినీ కోరారు. ఐక్యత చూపించకపోతే అందరూ ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. గత కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఫిబ్రవరి వరకు బిల్లుల్ని మార్చి వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ చెల్లింపులు జరగలేదని తెలిపారు.

ఆర్నెల్లుగా కోరుతున్నా ఎవరూ తమ బాధలు పట్టించుకోవడం లేదని అసోసియేషన్‌ వేదన వ్యక్తం చేసింది. ఇంజినీరింగ్‌ పనులు నిలిపివేసి ప్రజలకు తెలిసేలా ౖసైట్లలో బిల్లులు రానుందున పనులు నిలిపివేసినట్లు బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాల్సిందిగా అసోసియేషన్‌ సభ్యులు కాంట్రాక్టర్లను కోరారు. ఆమేరకు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బ్యానర్లు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు