పాపం..పసివాళ్లు

21 Mar, 2019 09:16 IST|Sakshi
జయలక్ష్మి మృతదేహం పక్కన చంటిబిడ్డతో బంధువులు (ఇన్‌సెట్‌) వీరేశ్, జయలక్ష్మి దంపతులు (ఫైల్‌)

సాక్షి, కళ్యాణదుర్గం:  నెల వ్యవధిలో అనారోగ్యం కారణంగా దంపతులిద్దరూ మృతి చెందడంతో అభం..శుభం తెలియని వారి పిల్లలు అనాథలుగా మారారు. వివరాల్లోకి వెళితే..వీరేష్, జయలక్ష్మి దంపతులు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో అద్దె ఇంట్లో నివసిస్తుండేవారు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవారు. అయితే ఫిబ్రవరి 20వ తేదీన అస్వస్థతకు గురై వీరేష్‌ మృతి చెందాడు. భర్త పోయిన బాధలో ఉన్న జయలక్ష్మికి గత వారం పురిటినొప్పులు వచ్చాయి.

దీంతో స్థానికులు ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నాటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండేది. బుధవారం అక్కడే మృతి చెందింది. దీంతో ఆమె కుమార్తెలు నవ్య(2), ఇటీవల పుట్టిన చిన్నారి అనాథలుగా మారారు. ప్రస్తుతం వీరేష్‌ సోదరి సరస్వతి వీరి ఆలనా పాలనా చూసుకుంటోంది. జయలక్ష్మి మృతదేహం వద్ద బంధువుల రోదనలు చూపరులను కలిచివేశాయి. అనాథలుగా మారిన చిన్నారులను దాతలు ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు