దిశ శరీరంలో ఆల్కహాల్‌ ఉన్నట్లు నిర్ధారణ

14 Dec, 2019 11:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దిశ అత్యాచారం, హత్య కేసు విచారణలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌) నివేదిక కీలకంగా మారింది. కాలిపోయిన దిశ శరీరం స్టెర్నమ్‌ బోన్‌ నుంచి సేకరించిన డీఎన్‌ఏ ఆధారంగా.. ఆ మృతదేహం దిశదే అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా ఘటనాస్థలంలోనే నిందితులు అత్యాచారం చేసినట్లుగా స్పష్టమైన ఫోరెన్సిక్‌ ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దిశ శరీరంలో ఆల్కహాల్‌ ఉన్నట్లుగా ఫోరెన్సిక్‌ నిపుణులు నిర్ధారించారు. దీంతో దిశపై అత్యాచారానికి పాల్పడటానికి ముందు నిందితులు ఆమెకు మద్యం తాగించినట్లుగా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ విషయాన్ని నిందితులు ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇక ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల డీఎన్‌ఏ నివేదికలో సైతం కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో జరిగిన నేరాలతో దిశ నిందితుల డీఎన్‌ఏ మ్యాచ్‌ అవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. దీని ఆధారంగా నిందితులకు నేర చరిత్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దిశను నలుగురు నిందితులు చటాన్‌పల్లి వద్ద పాశవికంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన విషయం విదితమే. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చివేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లగా అక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నిందితులు మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, జొల్లు నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా... విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం... ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్‌ను నియమించింది.

మరిన్ని వార్తలు