మా అమ్మకు ఇల్లు కట్టించండి

27 Nov, 2019 03:07 IST|Sakshi
దేవేందర్‌

ఇదే నా చివరి కోరిక

సూసైడ్‌ నోట్‌ రాసి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మిర్యాలగూడ అర్బన్‌: ‘మా అమ్మకు ఇల్లు కట్టించి నేను లేని లోటు లేకుండా చూడండి. ఇది నా చివరి కోరిక. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. కానీ పేదల బతుకులు మారడం లేదు. మా లాంటి పేదవారికి సాయం చేయండి. దేశంలో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆకలి కేకలను దేశం నుంచి పారదోలలేమా..?’అంటూ లేఖ రాసి ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డలో మంగళవారం చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. తాళ్లగడ్డకు చెందిన సోమశంకర్, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శివప్రసాద్‌ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు దేవేందర్‌ (17) స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. అద్దె ఇంట్లో నివాసం ఉంటూ తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొనడంతో మనస్తాపానికి గురైన దేవేందర్‌ ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దేవేందర్‌ రాసిన లేఖ.

సూసైడ్‌ నోట్‌ స్వాధీనం.. 
ఘటనా స్థలంలో దేవేందర్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని ఆర్థిక అసమానతల గురించి, ఇంట్లో తాము అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందుల గురించి లేఖలో వివరించాడు. ‘కోట్లు కూడబెట్టుకుని ధనంవంతులు ఏమి సాధిస్తారు. ఉన్నదాంట్లో మాలాంటి పేదలకు పంచి చూడండి. పేద వారికి సహాయం చేయండి. ఆ ఆనందం తెలుస్తుంది. మా అమ్మ, నాన్న మమ్మల్ని ఎంతగానో కష్టపడి పెంచుతున్నారు.

మాకు సొంత ఇల్లు కూడా లేదు. అమ్మ, నాన్న సంపాదించిన డబ్బులన్నీ ఇంటి అద్దెకే సరిపోతున్నాయి. మాలాంటి పేదవారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. కానీ పేదల బతుకులు మాత్రం మారడం లేదు. దేశంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వానిదే. ఇల్లు లేని పేదవారు ఉండకూడదు. నేను చనిపోయిన తర్వాత నన్ను పోస్టుమార్టం చేయండి. మా అమ్మకు ఇల్లు కట్టించి నేను లేని లోటు లేకుండా చూడండి. ఇదే నా చివరి కోరిక’అంటూ లేఖలో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు