వ్యాపం స్కామ్‌... ఉచ్చు బిగుస్తోందా?

24 Nov, 2017 08:45 IST|Sakshi

అర్థరాత్రి దాకా కొనసాగిన వాదనలు

నిందితులకు బెయిల్‌ తిరస్కరణ

భోపాల్‌ :  సంచలనం సృష్టించిన వ్యాపం నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. నిందితుల బెయిల్‌ పిటిషన్లను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు గురువారం మధ్యాహ్నాం 3గం. నుంచి శుక్రవారం వేకువ ఝామున (2గం.41ని.) దాకా కొనసాగాయి. మధ్యప్రదేశ్‌ చరిత్రలోనే తొలిసారి ఇలా జరగటం విశేషం.

ఈ సందర్భంగా దాఖలైన 30 ఇంటీరియమ్‌ బెయిల్‌ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. చిరయూ మెడికల్‌ కాలేజీ చైర్మన్‌ డాక్టర్‌ అజయ్‌ గోయెంకతోపాటు డీకే సప్తపతి, డాక్టర్‌ రవి సక్సేనా, ఎస్‌ ఎన్‌ సక్సేనా, డాక్టర్‌ వినాయక్‌ భవసర్‌, డాక్టర్‌ అశోక్‌ జైన్‌ తదితరుల అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. వీరితోపాటు పీపుల్స్‌ మెడికల్‌ కాలేజీ చైర్మన్‌​ విజయ్‌వార్గియా, డైరెక్టర్‌ అశోక్‌ నంగ్‌నాథ్‌, వైస్‌ ఛాన్స్‌లర్‌ విజయ్‌ కుమార్‌ల పిటిషన్లను కూడా తిరస్కరించింది. 

అంతకు ముందు వాదనలకు హాజరుకానీవారికి న్యాయస్థానం అరెస్ట్‌ వారెంట్లు జారీ చేయగా, ఒక లక్ష రూపాయల పూచీకత్తు మీద 15 మంది నిందితులకు బెయిల్‌ మంజూరు అయ్యింది.  మొత్తం 592 మందిలో నలుగురు వ్యాపమ్‌ అధికారులు, ముగ్గురు దళారులు, 22 మధ్యవర్తిత్వం వహించనవారు, 334 విద్యార్థులు, 155 మంది విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయని సీబీఐ తరపు న్యాయవాది సతీశ్‌ దినకర్‌ తెలిపారు.

కాగా, మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు(ఎమ్‌పీపీఈబీ) నిర్వహించే పరీక్షలో అక్రమాలకు పాల్పడటంతో  వ్యాపం స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. 1995 నుంచి ప్రవేశ పరీక్షల్లో అక్రమాల ద్వారా దాదాపు రూ.2 వేల కోట్ల రూపాయలు అధికారులకు చేరాయి. చిరయూ, పీపుల్స్‌, ఎల్‌ ఎన్‌ మెడికల్‌ కాలేజీలతోపాటు మరో మెడికల్‌ కాలేజీ యాజమాన్యాల పాత్రలపై ప్రధాన ఆరోపణలు వినిపించగా.. ఆయా కాలేజీ ఛైర్మన్‌లకు అరెస్ట్‌ కూడా చేశారు. గడిచిన పదేళ్లుగా ఈ కేసులో ఏదో ఒక కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. ఇందులో కీలక నేతల పేర్లు తెర మీదకు రావటం.. కేసులో నిందితులు ఆత్మహత్య చేసుకోవడమో లేదా విద్యార్థులకు సాయం చేసిన వ్యక్తులు హత్యకు గురికావడం వంటివి ఇప్పటికీ వ్యాపం స్కామ్‌ ఓ పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.

మరిన్ని వార్తలు