రోడ్డున పడ్డ కుటుంబం

20 Nov, 2023 10:00 IST|Sakshi

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తిని రోడ్డు ప్రమాదరూపంలో మృత్యువు వెంటాడింది. కుటుంబ పెద్ద మృతితో భార్య సాజిదా, పదేళ్లలోపు ఉన్న ముగ్గురు చిన్నారులు రోడ్డున పడ్డారు. నేడు ఆ కుటుంబానికి అండగా నిలిచేవారు లేక ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన మహమ్మద్‌ అజీజ్‌(32) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 17న మేడ్చల్‌లో తమ సమీప బంధువు ఇంట్లో శుభకార్యం ఉండగా అక్కడికెళ్లి తిరిగి వస్తుండగా వెనక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజీజ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ సంఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అప్పటి వరకు ఆటో నడుపుతూ వచ్చిన డబ్బులతో సంతోషంగా ఉంటున్న కుటుంబంలో ప్రమాదం విషాదాన్ని నింపింది. భార్య, ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారు. కనీసం సొంతిల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్న అజీజ్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన సాజిదా కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సాయం అందించాల్సిన వారు ఫోన్‌పే 63094 58382 నంబర్‌కు సాయం చేయాలని సాజిదా కోరుతోంది.

మరిన్ని వార్తలు