మరో ఇంటర్‌ విద్యార్థి..

8 May, 2019 06:45 IST|Sakshi

ఇంటర్‌ ఫెయిలయ్యానని విద్యార్థిని మనస్తాపం

ఆత్మహత్యాయత్నంతో 20 రోజులుగా చికిత్స పొందుతూ ఊపిరొదిలిన వైనం

వెంగన్నపాలెంలో విషాద ఛాయలు 

జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల మానస(17) అనే ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర విద్యార్థిని పరీక్ష ఫలితాల్లో ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకోగా..చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఊపిరొదిలింది. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సాయిల రమేష్, సునీత దంపతుల పెద్ద కుమార్తె సాయిల మానస ఈ ఏడాది ఇంటర్‌లో ఎంపీసీ మొదటి సంవత్సరం ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో చదువుకుంది. వార్షిక పరీక్షలు రాసి స్వగ్రామం వెంగన్నపాలెం వచ్చిం ది.

గత నెల 18న ఇంటర్‌ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మానస ఫిజిక్స్, ఇంగ్లిష్‌ తప్పితే మిగతా నాలుగు సబ్‌జెక్టులు ఫెయిలైంది. పదో తరగతిలో 8 జీపీఏ గ్రేడ్‌ సాధించి, బాగా చదువుతుందనే పేరున్న తాను ఫెయిల్‌ కావడమేంటని తదేకంగా ఆలోచిస్తూ..అదే రోజు రాత్రి ఇంట్లో ఉన్న కలుపు నివారణ మందును తాగింది. విషయా న్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ఐదు రోజులపాటు వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో..వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌ లోని ఓ సూపర్‌స్పెషల్‌ హాస్పిటల్‌లో తల్లిదంద్రులు చేర్పించారు. 20 రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందింది. మృతదేహాన్ని హైదారాబాద్‌ నుంచి వెంగన్నపాలెంకు మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఇంటర్‌ బోర్డు నిర్వాకం వల్లే తమ కుమార్తె ఫస్ట్‌ ఇయర్‌లో ఫెయిలైందని..ఆమె మృతదేహంపై పడి తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా రోదించారు. బాగా చదువుతుందనుకున్న అమ్మాయి..ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  తల్లిదండ్రులు, 9వ తరగతి చదువుతున్న ఆమె చెల్లెలు లిఖిత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు