అంతర్‌రాష్ట్ర కార్ల దొంగల ముఠా అరెస్టు

8 Dec, 2018 11:39 IST|Sakshi
పట్టుబడ్డ వాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌

ఏడు కార్లు స్వాధీనం

చిత్తూరు అర్బన్‌: తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కార్లను చోరీ చేసే అంతర్‌రాష్ట్ర ముఠాను పలమనేరు బైపాస్‌ రోడ్డులోని దండపల్లె క్రాస్‌ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ తెలిపారు. ఆయన చిత్తూరు నగరంలోని పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. వరుస కార్ల చోరీల నేపథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గంగవరం, పలమనేరు బైపాస్, దండపల్లె క్రాస్‌ల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో కుప్పం నుంచి పలమనేరు వైపు వరుసగా ఏడు కార్లు వస్తుండగా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. కార్లను డ్రైవర్లు వదిలి పరారయ్యారని పేర్కొన్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన  దినేశ్‌కుమార్‌ (32)ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఏడు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పరారైన దొంగలు ఆరుగురు తమిళనాడు వాసులని విచారణలో తేలిందన్నారు.

వేర్వేరు ప్రాంతాల్లో కార్ల చోరీ
దుండగులు ఆగస్టులో వరదయ్యపాళ్యం, శ్రీకాళహస్తి ప్రాంతంలో మూడు ఇన్నోవా కార్లు, సెప్టెంబర్‌లో విజయవాడలో మారుతి స్విఫ్ట్‌ కార్లు, బెంగళూరులో ఒక కారును చోరీ చేశారని ఎస్పీ తెలిపారు. వాటి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందన్నారు. దినేశ్‌కుమార్‌ ఇచ్చిన సమాచారం మేరకు ముఠా నాయకుడు మదురైకి చెందిన పరమేశ్వరన్‌ను అక్టోబర్‌ 16న వి.కోటలో అరెస్టు చేసినట్లు తెలిపారు. పరమేశ్వరన్‌ భార్య విజయలక్ష్మీ, దినేశ్‌కుమార్, దేవ పథకం ప్రకారం కార్లను చోరీ చేసి చెన్నై కొరత్తూరులోని సెకండ్‌ హ్యాండ్‌ షోరూమ్‌లో విక్రయిస్తున్నారని వివరించారు. ఆర్‌సీ నెంబర్లు, చాయిస్‌ నంబర్లను కూడా మార్చి చోరీ చేసిన కార్లను సులువుగా విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ద్విచక్ర వాహనానికి ఉండాల్సిన నంబర్లు కార్లకు, కార్లకు ఉండాల్సిన నంబర్లు ద్విచక్ర వాహనాలకు ఉన్నట్లు పేర్కొన్నారు.  త్వరలో పరారైన మిగతా ఆరుగురు నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. అనంతరం ముఠాను పట్టుకోవడానికి అధికారులతో పాటు కృషి చేసిన పలమనేరు క్రైమ్‌ పార్టీ హెడ్‌కానిస్టేబుల్‌ దేవరాజులురెడ్డి, శ్రీనివాసులునాయుడు, గజేంద్ర, జయకృష్ణ, కానిస్టేబుళ్లు ప్రకాశ్‌నాయుడు, సతీశ్, జ్ఞానప్రకాశ్, అల్లావుద్దీన్, వెంకటేశ్, గౌస్, ఎల్లప్ప, విశ్వనాథ్, సురేష్, హెచ్‌జీ శివ, లోకనాథ్‌ లను ఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు