అన్ను గ్యాంగ్‌ ఫ్రం మాలేగావ్‌!

11 Feb, 2020 08:01 IST|Sakshi

మహారాష్ట్ర కేంద్రంగా పలు నగరాల్లో నేరాలు

జ్యువెలర్స్‌ దృష్టి మళ్లించి దోచుకోవడంలో దిట్ట

గత ఏడాది గుల్జార్‌హౌస్‌లో నేరం చేసిన ముఠా

చాకచక్యంగా పట్టుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌

పీటీ వారెంట్‌పై కుర్లాకు తరలించిన అక్కడి పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో:  అన్ను డాన్‌గా చలామణి అయ్యే ఆమె పేరు సాజిదా బషీర్‌ అన్సారీ.. మహారాష్ట్రలోని మాలేగావ్‌కు చెందిన ఈమె మరికొందరిని ‘ఎంగేజ్‌’ చేసుకుంటుంది.. మహారాష్ట్రతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లోని నగరాల్లో పంజా విసురుతుంది.. గత ఏడాది అక్టోబర్‌లో గుల్జార్‌హౌస్‌లోని ఓ జ్యువెలరీ దుకాణం నుంచి భారీగా బంగారు చెవి దుద్దులు ఎత్తుకుపోయింది.. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు.. విచారణ నేపథ్యంలో కుర్లాలోనూ నేరం చేసినట్లు బయటపడింది. దీంతో గత వారం వచ్చిన అక్కడి పోలీసులు ఈ గ్యాంగ్‌ను పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లారు. 

ఆ మహిళల్ని సభ్యులుగా చేసుకుని..
మాలేగావ్‌లోని కమలాపుర ప్రాంతానికి చెందిన అన్ను డాన్‌ ఆ పట్టణంలో ఉన్న మహిళల్ని ఎంచుకుని గ్యాంగ్‌ ఏర్పాటు చేసుకుంటుంది. భర్తల నుంచి వేరుపడి ఒంటరిగా నివసిస్తున్న వారితో పాటు భర్తలు చనిపోయిన మహిళలను ఆకర్షిస్తుంది. తనతో వచ్చి సహకరిస్తే ఒక్కో ట్రిప్‌నకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తానంటూ ఒప్పందం చేసుకుంటుంది. ఇలా ఒక్కో దఫా నలుగురి నుంచి ఐదుగురు మహిళలు, ఇద్దరు డ్రైవర్లతో అద్దెకు తీసుకున్న తేలికపాటి వాహనాల్లో ఎంచుకున్న ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ గ్యాంగ్‌ సాధారణంగా మాలేగావ్‌ నుంచి కనిష్టంగా 300 గరిష్టంగా 600 కిమీ దూరంలో ఉన్న పట్టణాలను టార్గెట్‌గా చేసుకుంటుంది. మాలేగావ్‌ నుంచి బయలుదేరే ముందే వాళ్లు ఏం చేయాలనే దానిపై తమ అనుచరులకు  పక్కా ఆదేశాలు జారీ చేస్తుంది. దుకాణా యజమానులు, ఉద్యోగులను ఆకర్షించాలని, వివిధ వస్తువులు చూపమంటూ వారి దృష్టిని మళ్లించాలని స్పష్టం చేస్తుంది. దుకాణంలో ఉన్నంత సేపూ ఒకరికి ఒకరు పరిచయం లేనట్లే నటించాలని వారికి చెబుతుంది.  

దుకాణాదారుల దృష్టి మళ్లించి..
ఓ నగరాన్ని టార్గెట్‌గా చేసుకున్న తర్వాత అక్కడకు చేరుకునే అన్ను గ్యాంగ్‌ లాడ్జిలో బస చేస్తుంది. రద్దీగా ఉండి, ఎక్కువ మంది ఉద్యోగులు లేని బంగారం దుకాణాలను ఎంచుకుంటుంది. అన్ను సహా గ్యాంగ్‌ సభ్యులంతా ఎవరికి వారుగా వేర్వేరుగా ఆ దుకాణంలోని వస్తారు. ఆపై అనేక వస్తువులు చూసినట్లు నటించి, ఓ డిజైన్‌ను ఖరారు చేస్తారు. దానికి సంబంధించి ఆ దుకాణ యజమానికి అడ్వాన్స్‌ కూడా చెల్లిస్తారు. ఈ లోపు అన్న అదను చూసుకుని కొన్ని వస్తువులతో ఉన్న జ్యువెలరీ బాక్స్‌తో ఉడాయిస్తుంది. తర్వాత మిగిలిన వాళ్లూ ఏమీ ఎరగనట్లు వెళ్లిపోతారు. ఈ పంథాలో ఈ గ్యాంగ్‌ గత ఏడాది అక్టోబర్‌ 28న నాంపల్లిలోని లాడ్జిలో బస చేసింది. అదే రోజు సాయంత్రం గుల్జార్‌హౌస్‌లోని ఖాజా అండ్‌ సన్స్‌ జ్యువెలరీ దుకాణానికి వెళ్లింది. అక్కడ మోడల్స్‌ నచ్చలేదంటూ పక్క దుకాణం నుంచి చెవి రింగుల కూడిన బాక్స్‌ తెప్పించింది. చివరకు ఓ నెక్లెస్‌ నచ్చినట్లు నటించిన ఈ గ్యాంగ్‌ సభ్యులు దాన్ని అర్డర్‌ ఇచ్చింది. రూ.5 వేలు అడ్వాన్స్‌ సైతం చెల్లించి అదును చూసుకుని 22.5 తులాల బంగారు రింగులతో కూడిన ఆ బాక్స్‌ను తీసుకుని ఉడాయించింది. మరుసటి రోజు ఈ విషయం గుర్తించిన దుకాణ యజమాని మీర్‌చౌక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

వాహన నంబర్‌ ఆధారంగా..
ఓ నగరంలో నేరం చేసిన వెంటనే ఈ గ్యాంగ్‌ తమ వాహనంలో ప్రయాణమవుతుంది. మళ్లీ కొన్నాళ్ల దాకా  అటు వైపు రాదు. ఈ కేసు దర్యాప్తు చేయడానికి దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. బుర్ఖాలు ధరించిన నలుగురు మహిళల ఆనవాళ్లు వెతుకుతూ ఆ దుకాణం నుంచి వరుసగా అన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను తనిఖీ చేస్తూ వెళ్లింది. ఈ నేపథ్యంలోనే చార్మినార్‌ సమీపంలో ముఖానికి ముసుగులు తొలగించిన అనుమానితులు కనిపించారు. మరికొన్ని సీసీ కెమెరాలను తనిఖీ చేయగా వీళ్లు ప్రస్తుతం పార్కింగ్‌ ప్లేస్‌గా మారిన చార్మినార్‌ బస్టాండ్‌లో రెండు వాహనాలను ఉంచినట్లు తేలింది. వాటి నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మాలేగావ్‌కు చెందిన నేరగాళ్లుగా గుర్తించి అక్కడకు వెళ్లారు. అయితే అప్పటికే అన్ను గ్యాంగ్‌ రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్లినట్లు గుర్తించింది. అక్కడే కాపుగాసిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎట్టకేలకు అన్నుతో పాటు తాహెరా ఖుర్షీద్, నజియా షేక్‌                    ఇజ్రాయిల్, షబానా యూసుఫ్‌ మన్సూరీ, సయ్యద్‌ రహీం, సయ్యద్‌ నవాజ్‌లను అరెస్టు చేసింది. వీరి నుంచి 30 తులాల బంగారు ఆఖరణాలు రికవరీ చేసింది. విచారణ నేపథ్యంలో అన్ను గ్యాంగ్‌ 2012లో నిజామాబాద్‌లో నేరం చేసి అరెస్టు అయిందని తేలింది. పాతబస్తీ తర్వాత ఈ ముఠా ముంబైలోని కుర్లాలోనూ ఓ నేరం చేసినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. గత వారం పీటీ వారెంట్లతో వచ్చిన కుర్లా పోలీసులు ఈ గ్యాంగ్‌ను అక్కడకు తరలించారు.

మరిన్ని వార్తలు