టీడీపీ గూండాగిరిపై నిరసన గళం

11 Feb, 2020 08:04 IST|Sakshi
పూండి-గోవిందపురంలోని వైఎస్సార​ కూడలి వద్ద వలంటీర్లు, నాయకుల మానవహారం

వలంటీర్‌ సరస్వతిపై దాడికి  నిరసనగా పూండి–గోవిందపురంలో ర్యాలీ

నిందితులను అరెస్టు చేయాలని వలంటీర్ల డిమాండ్‌

సాక్షి, వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం) : టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటూ గ్రామ వలంటీర్లు నినదించారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న తమపై గూండాగిరి ప్రదర్శించి దాడులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కదం తొక్కా రు. పూండి– గోవిందపురం గ్రామ వలంటీర్‌ కిక్క రి సరస్వతిపై ఈ నెల 7న టీడీపీ నేత పుచ్చ ఈశ్వరరావు కుటుంబ సభ్యులు దాడి చేసి కొట్టడాన్ని నిరసిస్తూ తోటి వలంటీర్లు సోమవారం స్థానిక గ్రామ సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మంచినీటి పథకం తాళం ఇవ్వాలని కోరడమే వలంటీర్‌ పాపమా.. అంటూ మండిపడ్డారు. రాజకీయ ముసుగులో దాడులు చేసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే సహించబోమని ముక్త కంఠంతో నినదించారు.  

కేసు విచారణలో ఉంది.. 
వలంటీర్‌పై దాడులను ఉపేక్షించేది లేదని వజ్రపుకొత్తూరు ఎంపీడీఓ సీహెచ్‌.ఈశ్వరమ్మ స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసులు కేసుని విచారించారని, నిందితులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసినందున పోలీసులు అరెస్టు చేస్తారని  చెప్పారు. వైఎస్సార్‌ సీపీ  జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు నెలలుగా స్థానికులకు తాగునీరు అందించకుండా మంచినీటి పథకానికి తాళాలు వేశారని, దీనిపై ప్రశ్నిస్తే వలంటీర్‌ను జుత్తు పట్టుకుని కొట్టడం దారుణమన్నారు. నిరసన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చింత రవివర్మ, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు సీదిరి త్రినాథ్, మండల పార్టీ అధ్యక్షుడు పుక్కళ్ల గురయ్యనాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలిన ఉమామహేశ్వరరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు,  కొల్లి రమేష్, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ నర్తు ప్రేమ్‌కుమార్, మద్దిల హరినారాయణ, కె.గోపాల్, జి.రామారావు, కొల్లి జోగారవు, అంబటి శ్రీను, ఎంఆర్‌పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరూ ఖండించాలి.. 
వలంటీర్లపై దాడులను ప్రజా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు వారథులుగా పని చేస్తున్న తమపై దాడులు చేయడం దారుణం. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి.  
– నర్తు అరుణ, గ్రామ వలంటీర్, గడరుడభద్ర 

పరారీలో ఉన్నారు.. 
వలంటీర్‌పై దాడి చేసిన ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. గాలిస్తున్నాం. ఇప్పటికే నాన్‌ బెయిలబుల్‌  కేసు నమోదు చేశాం. వలంటీర్‌లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. విచారణ పూర్తయింది. సరస్వతికి న్యాయం చేస్తాం. 
– ఎం.గోవింద, ఎస్‌ఐ, వజ్రపుకొత్తూరు

మరిన్ని వార్తలు