రాధిక కేసు దర్యాప్తులో జర్మనీ టెక్నాలజీ

14 Feb, 2020 10:46 IST|Sakshi
ఆధారాలు సేకరిస్తున్న నిపుణులు

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్‌ బృందం

వివిధ ఆధారాలు సేకరించిన క్లూస్‌టీం

నాలుగో రోజుకు చేరిన విచారణ

హత్య జరిగిన రోజే  ప్రీఫైనల్‌ పరీక్షలు ప్రారంభం

పరీక్షకు హాజరుకాని రాధిక

సాక్షి, కరీంనగర్‌ : ఇంటర్‌ విద్యార్థిని రాధిక హత్య కేసులో మూడు రోజుల విచారణలో ఏమీ తేలకపోవడంతో గురువారం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్‌ బృందం కరీంనగర్‌ చేరుకుంది. హైదరాబాద్‌ సీటీ పోలీసు విభాగం నుంచి క్రైం సీన్‌ ఆఫీసర్‌ ఇంద్రాణి ఆధ్వర్యంలో ఐదుగురితో కూడిన బృందం కరీంనగర్‌ పట్టణం విద్యాగనర్‌లోని రాధిక ఇంటికి వెళ్లి వివిధ కీలకమైన ఆధారాలు సేకరించారు. అత్యాధునిక జర్మన్‌ టెక్నాలజీని ఉపయోగించి రక్తం మరకలు కడిగినా తర్వాత కూడా తెలుసుకునే త్రీడీ క్రైం సీన్‌ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఫారో 3డీ స్కానర్, బాడీ ప్లూయిడ్‌ కిట్స్‌ వంటివి ఉపయోగించి పలు ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. క్రైం సీన్‌ ఆఫీసర్‌ ఇంద్రాణి అడిషినల్‌ డీసీపీ చంద్రమోహన్‌తోపాటు టూ టౌన్‌ సీఐ దేవారెడ్డిని రాధిక ఘటనకు సంబంధించిన వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. పూర్వపరాలు వివరించిన తర్వాత క్లూస్‌ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు.  (మిస్టరీగా మారిన రాధిక హత్య..)

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ఆధారాలు...
హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక ఫోరెన్సిక్‌ క్లూస్‌టీం బృందం రాధిక హత్య జరిగిన బెడ్‌రూంలో రక్తపు మరకలు పడిన చోటు, ఇంట్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల ఆధారాలు సేకరించారు. త్రీడీ క్రైంసీన్‌ ఫొటోగ్రఫీ, వీడీయోగ్రఫీతో ఘటన జరిగిన ప్రదేశంలో ఫొటోలు, వీడియోలు తీశారు. హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు రక్తం కడిగిన స్థలం, గతంలో ఇక్కడి క్లూస్‌టీం సేకరించిన ఆధారాల గురించి వివరంగా తెలుసుకొనిఅవసరమైన సమాచారాన్ని తీసుకున్నారు. నూతన టెక్నాలజీతో కావాల్సిన ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. (హంతకుడు ఎవరు..?)


ఆధారాలు సేకరిస్తున్న హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం  

ప్రీఫైనల్‌ పరీక్ష రోజే హత్య..!
రాధిక హత్య జరిగిన రోజే రెండో ప్రీఫైనల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు 10వ తేదీ నుంచి వారాంతం వరకు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 నుంచి 4.30 వరకు పరీక్ష జరిగింది. కానీ ప్రీఫైనల్‌ పరీక్షలకు హాజరు కాలేదు. ఒక వేళ హాజరు కావాలనుకుంటే పరీక్ష సమయానికి ముందే చేరుకోవాలి. అంటే మధ్యాహ్నం 12 నుంచి 1గంటల మధ్య కళాశాలకు చేరుకోవాల్సి ఉంటుంది. రాధిక హత్య జరిగిన తీరు చూస్తే మాత్రం దాదాపుగా మధ్యాహ్నమే జరిగి ఉంటుందని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ కళాశాలకు వెళ్లాలనుకుంటే  సిద్దమమ్యేటప్పుడు హత్య గురై ఉంటుందా..? అంతకుముందే హత్యకు గురైందా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా పోలీసులు విచారణ జరిపినట్లు తెలిసింది.  

హంతకుడి జాడేది..?
రాధిక హత్య కేసు విచారణ నాలుగవ రోజుకు చేరినప్పటికీ హంతకుడెవరో తెలియలేదు. గతంలో సేకరించిన ఆధారాలు, ఫోన్‌కాల్‌ డాటా, సీసీ పుటేజీల పరిశీలన, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడం వంటివి చేసినా అనుకున్న ఫలితాలను ఇవ్వలేదని తెలుస్తోంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఫోరెన్సిక్‌ నిపుణులు కేసుకు కావాల్సిన ఆధారాలు  సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వాటి రిపోర్టుల వచ్చాక కేసు ఛేదనకు కావాల్సిన ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. హంతకుడెవరనే విషయంపై ఇటు పోలీసుల్లో, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఫోరెన్సిక్‌ రిపోర్టులు వచ్చాక ఏమైనా ముందుకు సాగుతుందో చూడాల్సిందే.

చదవండి : గొంతు కోసి.. ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

మరిన్ని వార్తలు