మహిళా ప్రొఫెసర్‌కు 15 కత్తిపోట్లు

26 Sep, 2017 20:26 IST|Sakshi

సాక్షి, చెన్నై: మధురై కామరాజ్‌ విశ్వవిద్యాలయ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను, పార్ట్‌టైమ్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన వ్యక్తి కత్తితో 15 సార్లు పొడిచాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మధురై కామరాజర్‌ విశ్వవిద్యాలయం సాంకేతిక సమాచార విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా జెనిఫా (42) పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో పార్ట్‌టైం ప్రొఫెసర్‌గా జ్యోతి మురుగన్‌ పనిచేసేవాడు. అతడు సరిగ్గా పనికి రావటం లేదని జెనిఫా పలుమార్లు మందలించారు. అయినా అతని తీరు మారకపోవటంతో విధుల నుంచి తొలగించారు. దీంతో అతనికి జెనిఫాపై అతను కోపం పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం జెనిఫా విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో ఉండగా జ్యోతి మురుగన్‌ వచ్చాడు. తనను మళ్లీ విధుల్లో చేర్చుకోవాలని కోరగా ఆమె నిరాకరించింది. ఆవేశంతో ఊగిపోయిన మురుగన్, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను 15సార్లు పొడిచాడు. ఆమె కేకలను విన్న తోటి ప్రొఫెసర్లు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెని రక్షించే ప్రయత్నం చేశారు. చికిత్స కోసం పుదుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రస్తుతం మధురైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నాగమలై పుదుకోట పోలీసులు మురుగన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లుగా చెప్పి వివాహం చేసుకున్నానని, ఇప్పుడు భార్య తరఫు వారు ఉద్యోగం లేదని అడుగుతున్నారని, అందుకే, మళ్లీ ఉద్యోగం ఇవ్వమని జెనిఫాను తాను కోరగా.. ఆమె తిరస్కరించిందని అందుకే కోపంలో దాడి చేసినట్లు మురుగన్‌ తెలిపాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని మధురై ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు