మంటలకు కాంప్లెక్స్‌ నిర్వాహకుడి ఆహుతి

3 Mar, 2018 13:10 IST|Sakshi
అనుమానాస్పదంగా మృతి చెందిన వృద్ధుడు వెంకటేశ్వరరావు

సంఘటనపై పలు అనుమానాలు

పోలీసుల దర్యాప్తు

రాజమహేంద్రవరం క్రైం:  వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరి«ధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా గన్నవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(65) కొంతకాలంగా భార్య, పిల్లలతో గొడవపడి రాజమహేంద్రవరం వచ్చేశాడు. ఇతడు గోదావరి గట్టున మార్కండేయస్వామి గుడి సమీపంలో ఉన్న సులభ కాంప్లెక్స్‌ను రెండు నెలలుగా కంచిపాటి గోవింద్‌ వద్ద సబ్‌ లీజుకు తీసుకొని నిర్వహిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సులభ కాంప్లెక్స్‌ నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికుల అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే మంటలలో చిక్కుకున్న వెంకటేశ్వరరావు పూర్తిగా కాలిపోయి మృతి చెందాడు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పాతకక్షల నేపథ్యంలో ఎవరైనా పెట్రోల్‌ పోసి అంటించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటైతే సులభ కాంప్లెక్స్‌ మొత్తం మంటలు వ్యాపించి ఉండేవి. కేవలం నిర్వాహకుడు కూర్చొనే క్యాబిన్‌ మాత్రమే అంటుకోవడం, మంటలలో పూర్తిగా కాలిబూడిద కావడం బట్టి చూస్తే ఇది హత్యేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు ఎప్పుడు రాజమహేంద్రవరం వచ్చాడనేది స్థానికులు చెప్పలేకపోతున్నారు. స్థానికులకు వెంకటేశ్వరరావుగా పరిచయమయ్యాడు. ఇంటి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఎవరికీ చెప్పలేదని స్థానికులు పేర్కొంటున్నారు. మృతుడు పూర్తిగా కాలిపోవడం బట్టి చూస్తే ఎవరైనా కావాలనే అంటించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలాన్ని వన్‌టౌన్‌ సీఐ రవీంద్ర, ఎస్సై రాజశేఖర్‌ పరిశీలించారు. ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. సులభ కాంప్లెక్స్‌ ప్రధాన నిర్వాహకుడు కంచిపాటి గోవింద్‌ను ప్రశ్నించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు