ఫ్యామిలీ కోసం ప్రాణాలే ఇచ్చాడు

10 Sep, 2019 14:44 IST|Sakshi

జైపూర్‌ :  ఎవరైనా తనకు పగ ఉన్నవారిని లేదా నచ్చని వారిని హత్య చేయించడానికి సుపారీ ఇస్తారు. కానీ ఓ వ్యక్తి తన హత్యకు తానే సుపారీ చెల్లించాడు. ఎలా చంపాలో స్కెచ్‌ వేసి మరీ హత్య చేయించుకున్నాడు. అయితే ఇదంతా తన కుటుంబం కోసమే చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పులు పెరిగిపోవడంతో ఏం చేయాలో తోచక హత్య చేయించుకున్నాడు. తాను చనిపోతే తన పేరు మీద ఉన్న రూ.50 లక్షల బీమా డబ్బులతో తన కుటుంబం కష్టాల కడలి నుంచి గట్టెక్కుతుందని భావించి ఆ వ్యక్తి ఈ దారుణ చర్యకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని భిల్వారాకు చెందిన బాల్బీర్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇందుకోసం భారీ వడ్డీకి రూ.20 లక్షలు అప్పు చేశాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. గత ఆరు నెలల నుంచి ఆ కుటుంబ పరిస్థితి అత్యంత అద్వాన్నంగా తయారైంది. దీంతో తాను తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోయాడు.

దిక్కుతోచని స్థితిలో తనను హత్య చేయించుకుంటే తన కుటుంబం బాగుపడుతుందని ఆలోచించాడు. తాను చనిపోతే తన పేరు మీద ఉన్న రూ.50లక్షల వ్యక్తిగత బీమా కుటుంబానికి అందుతుందని, దీంతో తన అప్పులన్నీ తీరిపోతాయనుకున్నాడు. వెంటనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన కిరాయి హంతకుడు సునీల్‌ యాదవ్‌ను పిలిపించి తన హత్యకు రూ. 80 వేలు సుపారీ ఇచ్చాడు. సునీల్‌ తోడుగా మరో హంతకుడు రాజ్‌వీర్‌ను పిలిపించుకొని బల్బీర్‌ను హత్య చేశాడు. 

హత్యకు రెండు రోజుల ముందు.. తనను ఎక్కడ చంపాలో ఆ ప్రాంతాన్ని హంతకులకు చూపించాడు బాల్బీర్‌. మొత్తానికి అనుకున్నట్టుగానే బాల్బీర్‌ను కిరాయి హంతకులు హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాల్బీర్‌. కుటుంబాన్ని అప్పుల నుంచి విముక్తి చేసి.. వారు మంచి జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతోనే బాల్బీర్‌ ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు భావించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా