అద్దె కార్లను అమ్ముకున్నాడు..

12 Sep, 2018 08:57 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ శ్రీనివాస్‌ నిందితుడు శ్రీబాలవంశీకృçష్ణ

వాటి యజమానులు చనిపోయినట్లు నకిలీ పత్రాల సృష్టి  

అసలు విషయం బయట పడటంతో కటకటాల పాలు

బంజారాహిల్స్‌: గుర్రపు పందేలకు బానిసైన ఓ యువకుడు... బతికున్న వాళ్లను చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ కటకటాల పాలయ్యాడు. మంగళవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌.శ్రీనివాస్‌ వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని పోరంకి గ్రామానికి చెందిన పొట్లూరి శ్రీ బాలవంశీకృష్ణ (31) మణికొండ పుప్పాలగూడ సమీపంలోని వినాయనగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. జల్సాలకు, గుర్రపు పందేలకు బానిసై అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేందుకు ప్రణాళికలు రూపొందించాడు. కార్లు అద్దెకు తీసుకొని రెండు నెలలు గడిచిన తర్వాత సంబంధిత కారు యజమాని చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి దానిని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టసాగాడు.

కొనుగోలుదారులకు ఆ కారు యజమాని చనిపోయాడని తనకే విక్రయించాడంటూ నమ్మించేవాడు. ఇప్పటి వరకు ఎనిమిది మంది దగ్గర ఇలా కార్లు అద్దెకు తీసుకొని ఆ యజమానులు చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి ఓఎల్‌ఎక్స్‌లోనే వాటిని అమ్మకానికి పెట్టాడు. ఇలా రూ.30 లక్షలు వసూలు చేశాడు. గత నెల గుర్రపు పందేల్లో రూ.25 లక్షల వరకు నష్టపోయాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన శ్రీలత అనే మహిళకు ఇలాగే ఓ కారును విక్రయించాడు. ఆ కారు యజమాని సురేష్‌ జాదవ్‌ చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించడంతో ఆమె రుణసౌకర్యం కోసం బ్యాంకుకు వెళ్లి ప్రశ్నించింది. అసలు విషయం అక్కడ బయటపడింది. దీంతో నిందితుడిని విచారించగా ఇప్పటి వరకు చేసిన మోసాలన్నీ ఒప్పుకున్నాడు. నెట్‌లోకి వెళ్లి చనిపోయిన వారి డేటా తీసుకొనేవాడు. అందులో వారిపేర్లు చెరిపేసి తాను అద్దెకు తీసుకున్న కారు యజమాని పేరును రాసి చనిపోయినట్లుగా చిత్రీకరించేవాడని పోలీసులు తెలిపారు. కార్ల పేరుతో ఎనిమిది మందిని మోసం చేశారని తెలిపారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ బచ్చు శ్రీనును డీసీపీ అభినందించారు.  

మరిన్ని వార్తలు