ఛత్తీస్‌గఢ్‌ టు సిటీ!

30 Aug, 2019 12:27 IST|Sakshi

గుట్టుగా గంజాయి అక్రమ రవాణా నలుగురి అరెస్ట్‌

నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు

సాక్షి, సిటీబ్యూరో: భద్రాచలం సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి సిటీలో విక్రయిస్తున్న ముఠా గుట్టును తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 23 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ గురువారం వెల్లడించారు. ధూల్‌పేటలోని గంగాబౌలి ప్రాంతానికి చెందిన బి.భరత్‌సింగ్‌ వృత్తిరీత్యా రియల్టర్‌. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం గంజాయి విక్రేతగా మారాడు.  గతంలో అతడిపై లంగర్‌హౌస్, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌ ఠాణాలతో పాటు ధూల్‌పేట ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌లోనూ గంజాయి సంబంధిత కేసులు ఉన్నాయి. ఇటీవల ఇతడికి ఛత్తీస్‌గడ్‌కు చెందిన మరాయ్‌గూడకు చెందిన కర్కా రాముతో పరిచయమైంది.

భరత్‌సింగ్‌ కోరినప్పుడల్లా ఏజెన్సీ నుంచి గంజాయి సమీకరించి విక్రయించేవాడు. దీన్ని నగరానికి రవాణా చేసే బాధ్యతల్ని భరత్‌ తన బంధువు, స్నేహితుడు అయిన కొండారెడ్డి శ్రీకాంత్, రమాత్‌ రమేష్‌లకు అప్పగించాడు. వీరిద్దరూ తరచుగా అక్కడకు వెళ్ళి ఆటోలో గంజాయి తీసుకువచ్చి భరత్‌కు అందజేసేవారు. నగరంలో ఉన్న కస్టమర్లకు భరత్‌ విక్రయిస్తూ వచ్చిన మొత్తంలో వారిద్దరికీ కొంత కమీషన్‌ ఇచ్చేవాడు. ఇటీవల రాముకు 23 కేజీలు గంజాయి కోసం ఆర్డర్‌ ఇచ్చిన భరత్‌ తన వారిని  పంపుతున్నానని, వారితో పాటు వచ్చి డబ్బు తీసుకువెళ్లాలని కోరడంతో రాము అలానే చేశాడు. దీనిపై తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ నేతృత్వంలో ఎస్సైలు సి.వెంకటేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవిందు తమ బృందాలతో వలపన్నారు. గురువారం నలుగురు నిందితులను పట్టుకుని గంజాయి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని మంగళ్‌హాట్‌ పోలీసులకు అప్పగించారు..

మరిన్ని వార్తలు