మనస్తాపం.. క్షణికావేశం

4 Oct, 2017 12:44 IST|Sakshi
కుటుంబ సభ్యులను విచారిస్తున్న సీఐ రవి.. వైష్ణవి, సునిత (ఫైల్‌)

ముగ్గురి ప్రాణాలు బలి

ఇద్దరు కూతుళ్లతో కలిసి కాలువలో దూకిన గర్భిణి

చిన్నారి మృతదేహం లభ్యం

మూడు బృందాలతో గాలింపు చర్యలు

సంఘటనా స్థలం వద్ద మిన్నంటిన రోదనలు

గద్వాల పట్టణంలో విషాదం

కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి మనస్పర్థలు ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నాయి. తీవ్ర మనోవేదనకు గురైన ఆ తల్లి చనిపోవాలనుకుంది. తన ఇద్దరు చిన్నారులను కూడా వెంట తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్టుగానే నిండుగా ప్రవహిస్తున్న జూరాల ప్రాజెక్టు కుడి కాలువలో దూకి కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.  

గద్వాల క్రైం: గద్వాల జిల్లాకేంద్రంలోని బృందావన్‌ కాలనీకి చెందిన తెలుగు రాజేష్‌ను నాగర్‌కర్నూల్‌కు చెందిన సునిత (27)తో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు అమృత(5), వైష్ణవి(3) ఉన్నారు. ప్రస్తుతం 5 నెలల గర్భిణీ. ఎంతో అన్యోన్యంగా సాగే వీరి సంసారంలో ఇటీవలే చిన్నచిన్న మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాత్రి పిల్లల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సునిత మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా పిల్లలను వెంట పెట్టుకొని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువ వద్దకు వెళ్లి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నుంచి భార్యా పిల్లలు కన్పించక పోవడంతో చుట్టు పక్కల, బంధువుల ఇళ్లల్లో వాకాబు చేసినా ఆచూకి లభించలేదు.  

చిన్నారి మృతదేహంతో వెలుగులోకి..
భర్త, తల్లిదండ్రులు, బంధువులు గ్రామంలో వెతుకుతుండగా జములమ్మ రిజర్వాయర్‌లో ఓ పసికందు మృతదేహం తెలియాడుతూ కన్పించింది. రిజర్వాయర్‌లోకి వెళ్లి చూడగా అది రాజేష్‌ కుతూరు వైష్ణవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కాలువ గట్టున కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని పీజేపీ అధికారులతో మాట్లాడారు. కాలువలోని నీటిని నిలిపి వేయించారు. గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడుతుడడంతో గద్వాల సీఐ రవి, రూరల్‌ ఎస్‌ఐ అంజద్‌అలీ మరో ఇద్దరు గజ ఈతగాళ్ల సహాయంతో రిజర్వాయర్‌లో గాలింపు ముమ్మరం చేశారు.   

పట్టణంలో చర్చనీయాంశం
అయిదు నెలల గర్భిణీ తన ఇద్దరు చిన్నారులను తీసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో  పట్టణంలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందనే విషయం తెలియక ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. భార్యభర్తల మధ్య  తలెత్తిన వివాదమా.. లేక మరేదైనా కారణమా అనే విషయం తెలియరాలేదు. ఈ సంఘటనతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  బంధువులు, కుటుంబసభ్యులు ఏటివద్దే ఉండి కన్నీరుమున్నీరుగా విలపించారు. 

మరిన్ని వార్తలు