పండగవేళ విషాదం

13 May, 2019 13:03 IST|Sakshi
ఘటనా స్థలంలో సొమ్మసిల్లిపోయిన అయ్యప్ప

మోదకొండమ్మ ఉత్సవానికి వస్తుండగా ప్రమాదం

వివాహిత దుర్మరణం

విశాఖపట్నం ,పాడేరు: మండలంలోని మినుములూరు సమీ పంలో కాఫీబోర్డు కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ  వివాహిత   దుర్మరణం చెం దింది. మోదకొండమ్మ పండగకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి...  నగల వ్యాపారి శ్రీశైలపు అయ్యప్ప, తన భార్య రమ్య(23)తో కలిసి బైక్‌పై వస్తూ   ముందు వెళ్తున్న ఆటోను తప్పించేందుకు యత్నించాడు. ఆ సమయంలో ఎదురుగా బస్సు రావడంతో  బ్రేక్‌ వేశాడు.  బైక్‌పై వెనుక కూర్చున్న రమ్య అదుపుతప్పి తుళ్లి కిందపడింది. ఎదురుగా వస్తున్న బస్సు చక్రం కింద తలపడడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది.  కిందపడిన అయ్యప్ప కూడా తీవ్ర షాక్‌కు గురై సొమ్మసిల్లిపోయాడు. ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఆర్టీసీ బస్సును, డ్రైవర్‌ ఎస్‌.గురును పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమ్య మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించినట్టు ఎస్‌ఐ రామారావు తెలిపారు.

పెళ్లయిన ఏడాదికే..
రమ్య మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.  శ్రీశైలపు బ్రహ్మాజీ  ఎన్నో ఏళ్లుగా పాడేరులో స్థిర నివాసం ఏర్పర్చుకుని బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తన పెద్దకుమారుడైన అయ్యప్పకు రమ్యతో గత ఏడాది వివాహం చేశారు. భార్య రమ్యతో కలిసి అయ్యప్ప కొన్నాళ్ల నుంచి విజయనగరంలో నగల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పాడేరులో మోదకొండమ్మ పండగ కోసం భార్యభర్తలిద్దరూ విజయనగరం నుంచి పాడేరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రమ్య మృతి చెందడంతో  భర్త అయ్యప్పతో పాటు ఇంటిల్లిపాదీ గుండెలవిసేలా విలపించారు. ఆదివారం సాయంత్రం రమ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు