లాస్‌ వేగాస్‌లో కాల్పులు

2 Oct, 2017 12:52 IST|Sakshi

లాస్‌ వేగాస్‌: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. లాస్‌ వేగాస్‌లో ఆదివారం అర్ధరాత్రి ఓ సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో కనీసం ఇద్దరు చనిపోగా.. 24మందికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. లాస్‌ వేగాస్‌ స్ట్రిప్‌లో దేశీయ సంగీత ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత విభావరి జరుగుతున్న మాండలై బే హోటల్‌లో సాయుధుడు ఒక్కసారిగా కాల్పలకు తెగబడ్డాడు. దీంతో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు భయభ్రాంతులకు గురై.. ప్రాణాలు దక్కించుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీశారు. సంఘటనా స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. కాల్పుల గురించి సమాచారం అందడంతో వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు తెగబడ్డ సాయుధుడిని హతమార్చినట్టు లాస్ వేగాస్‌ పోలీసులు ధ్రువీకరించారు. అయితే, సాయుధుడికి సంబంధించిన వివరాలేవీ వెల్లడించలేదు. సంఘటనా స్థలం నుంచి పలువురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు సీఎన్‌ఎన్‌ వెల్లడించింది.  

మాండలై బే రిసార్ట్‌లోని 32వ అంతస్తులో సాయుధ కాల్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కాల్పులతో లాస్‌ వేగాస్‌ నగరం ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. నగరం పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. సంఘటన స్థలం వైపు ప్రజలు ఎవరూ రాకూడదని పోలీసులు సూచించారు.

మరిన్ని వార్తలు