ప్రతీకారం తీర్చుకున్న బలగాలు

23 Jul, 2018 03:02 IST|Sakshi
ఎన్‌కౌంటర్‌లో ధ్వంసమైన ఇంటి వద్ద గుమిగూడిన ప్రజలు

కానిస్టేబుల్‌ సలీమ్‌ను హత్యచేసిన ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

శ్రీనగర్‌/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ మొహమ్మద్‌ సలీమ్‌ షాను కిరాతకంగా హత్యచేసిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఆదివారం మట్టుబెట్టాయి. దీంతో ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కుల్గామ్‌ జిల్లాలోని ముతల్‌హమాకు చెందిన కానిస్టేబుల్‌ సలీమ్‌ షా సెలవుపై శుక్రవారం ఇంటికి రాగా, అతన్ని కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు తీవ్రంగా హింసించి చంపారు. మరుసటి రోజు రెడ్వానీ పయీన్‌ గ్రామంలోని ఓ నర్సరీ సమీపంలో సలీమ్‌ మృతదేహం లభ్యమైంది.

ఉగ్రవాదుల ఆచూకీపై నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రెడ్వానీ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఈ కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించగా, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌లో భద్రతాబలగాలకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు.

ఉగ్రవాదుల్ని పాకిస్తాన్‌కు చెందిన మువావియా, కుల్గామ్‌కు చెందిన సోహైల్‌ అహ్మద్‌ దార్, రెహాన్‌లుగా గుర్తించామన్నారు. వీరంతా లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్ర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు పోలీస్‌ రికార్డుల్లో ఉందన్నారు. ఘటనాస్థలంలో రెండు ఏకే–47 తుపాకులు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని హీరానగర్‌ సెక్టార్‌లోకి పాక్‌ నుంచి అక్రమంగా ప్రవేశించడానికి యత్నించిన ఓ పాకిస్తానీ పౌరుడి(24)ని బీఎస్‌ఎఫ్‌ ఆదివారం కాల్చిచంపింది. ఇతడు పాక్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదుల్ని కశ్మీర్‌లోకి తీసుకొచ్చేందుకు గైడ్‌గా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు.

ఉగ్రదాడులు తగ్గుముఖం..
జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించినప్పటి నుంచి ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయింది. ఉగ్రదాడులు తగ్గినప్పటికీ రాళ్లు విసిరే ఘటనలు మాత్రం రాష్ట్రంలో స్వల్పంగా పెరిగాయి.

మరిన్ని వార్తలు