షాకింగ్‌: చనిపోయిందనుకుంటే..తిరిగొచ్చింది

17 Feb, 2020 09:50 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌కు చేరిన తిరుమలరెడ్డి అచ్చమ్మ

ఉన్నఊరిని, కుటుంబాన్ని విడిచి రెండేళ్లు అజ్ఞాతంలో.. 

ఏడు నెలల క్రితం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన భర్త  

సాక్షి పెద్దదోర్నాల(ప్రకాశం) : రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయి..చనిపోయిందనుకున్న ఓ వృద్ధురాలు గ్రామానికి తిరిగొచ్చింది. వివరాల్లోకి వెళ్తే..ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని పెద్దబొమ్మలాపురానికి చెందిన తిరుమలరెడ్డి అచ్చమ్మ (60)కు భర్త గండివీరయ్య, ఇద్దరు కుమారులు వీరనారాయణరెడ్డి, శివారెడ్డి ఉన్నారు. భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగి రెండేళ్ల క్రితం అచ్చమ్మ ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. భర్త, కుమారులు ఆమె ఆచూకీ కోసం వెదికినా ఫలితం లేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. చివరకు అందరూ ఆమె ఎక్కడో చనిపోయి ఉంటుందని అనుకుని వెదకడం మానేసి ఎవరి పనిలో వారు పడ్డారు. ఈ క్రమంలో ¿భర్త గండి వీరయ్య గతంలో తాను చేసిన అప్పుల బాధ తాళలేక ఊరిలో ఎక్కడ మాట పడాల్సి వస్తుందోనన్న అవమాన భారంతో ఏడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.

రోజులు గడిచిన క్రమంలో శనివారం రాత్రి కనిపించకుండా పోయిన అచ్చమ్మ స్వగ్రామానికి తిరిగొచ్చింది. దీంతో ఆమె ఇద్దరు కుమారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. రెండేళ్లుగా కనిపించకుండా పోయి.. చనిపోయిందనుకున్న తమ తల్లి తిరిగి రావడంతో వారు ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక గ్రామస్తుల ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుసుకున్న అచ్చమ్మ హృదయ విదారకంగా రోదించింది. ఈ సందర్భంగా అచ్చమ్మ మాట్లాడుతూ డబ్బుల విషయంలో తనకు, తన భర్తకు మాటా, మాటా పెరిగిందని దీంతో తాను ఇంట్లో చెప్పకుండా కర్నూలుకు వెళ్లి పోయాయని తెలిపింది. తాను పలానా గ్రామానికి చెందినట్లు ఎవరికీ చెప్పలేదంది.  తనకు ఆశ్రయం ఇచ్చిన రఘురామిరెడ్డి అనే విద్యుత్‌శాఖ కాంట్రాక్టర్‌ తనను సొంత తల్లిలా చూసుకున్నారని అచ్చమ్మ తెలిపింది. చివరకు తన చిన్న కుమారుడికి తెలిసిన వారి ద్వారా తన సమాచారం పంపటంతో వారు స్వగ్రామానికి చేర్చారని చెప్పింది. కుటుంబ సభ్యులు ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి..ఫిర్యాదు వెనక్కు తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు