రేప్‌ కేసులో బాలీవుడ్‌ నటుడి కుమారుడికి బెయిల్‌

7 Jul, 2018 20:56 IST|Sakshi
మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ చక్రవర్తి(పాత చిత్రం)

న్యూఢిల్లీ : రేప్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి భార్య యోగితా బాలి, కుమారుడు మహాక్షయ్‌ చక్రవర్తిలకు ఢిల్లీ కోర్టు శనివారం యాంటిసిపేటరీ బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల షూరిటీ సమర్పించడంతో జడ్జి అశుతోష్‌ కుమార్‌ బెయిల్‌ ఇచ్చారు. ఈరోజు(శనివారం) తమిళనాడులోని నీల్‌గిరి జిల్లా ఊటీలో మహాక్షయ్‌ చక్రవర్తి పెళ్లి, హీరోయిన్‌ మదాలసా శర్మతో జరగాల్సి ఉంది. ఈ ఘటనతో పెళ్లి రద్దు అయింది. తనకు మహాక్షయ్‌తో నాలుగు సంవత్సరాలుగా ఫిజికల్‌ రిలేషన్‌ ఉందని, తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్‌ చేశాడని రేప్‌ ఆరోపణలు చేసిన మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మహాక్షయ్‌ వల్ల తాను గర్భవతిని అయ్యాయని, ఈ విషయం తెలిసి తనకు తెలియకుండా మాత్రలు మింగించి బలవంతంగా అబార్షన్‌ చేయించాడని ఫిర్యాదులో తెలిపింది.

యోగితా బాలి తన చంపుతానని బెదిరిస్తోందని, మహాక్షయ్‌తో సంబంధం పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిందని కూడా ఫిర్యాదులో వెల్లడించింది. తనకు యోగితా బాలి, మహాక్షయ్‌తో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఫిర్యాదు ద్వారా కోరింది. ప్రాథమిక వివరాలను బట్టి యోగితా బాలి, ఆమె కుమారుడు మహాక్షయ్‌ చక్రవర్తిలపై చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవచ్చునని, ఆ ప్రకారం దర్యాప్తు చేపట్టవచ్చునని కోర్టు అభిప్రాయపడింది. 

మరిన్ని వార్తలు