‘బ్యాంకు నంబర్లు’ జర భద్రం!

17 Jul, 2018 11:08 IST|Sakshi

ఎస్సెమ్మెస్‌ అలర్ట్‌ల కోసం ఫోన్‌ నంబర్‌ లింకేజ్‌

నంబర్‌ మారినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందే

ఎన్‌ఆర్‌ఐ ఖాతా నుంచి నగదు స్వాహా

సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపై అప్రమత్తత కోసం ప్రతి ఒక్కరం రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది బ్యాంకు అధికారిక రికార్డుల్లో నమోదవుతుంది. ఈ సెల్‌ నంబర్‌ ఆధారంగానే కొన్ని ఆర్థిక లావాదేవీల యాప్స్‌ పని చేస్తుంటాయి. ఇంతటి కీలకమైన రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం తప్పదు. నగరానికి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ చూపిన చిన్న నిర్లక్ష్యం రూ.7 లక్షల నష్టాన్ని మిగిల్చింది. దీనిపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.మధుసూదన్‌ సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

విదేశాలకు వెళ్లడంతో...
నగరానికి చెందిన ఓ యువతికి ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంది. కొన్నేళ్ల క్రితం తెరిచిన ఈ ఖాతాకు తన ప్రీ పెయిడ్‌ సెల్‌ఫోన్‌ నెంబర్‌కు లింకు చేసుకుంది. సదరు బ్యాంకు ఖాతాలో జరిగిన ప్రతి లావాదేవీపై అలర్ట్‌ వచ్చేలా ఈ నెంబర్‌ను రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌గా మార్చుకున్నారు. గడిచిన కొన్నేళ్లుగా విదేశాల్లో ఉంటున్న ఈ యువతి ఎన్‌ఆర్‌ఐగా మారారు. నాలుగు నెలల క్రితం తన సెల్‌ఫోన్‌ నెంబర్‌ మార్చుకుని ‘రిజిస్టర్డ్‌ నెంబర్‌’ వదిలేశారు. ఈ విషయాన్ని ఈ–మెయిల్‌ రూపంలో బ్యాంకు దృష్టికి తీసుకువెళ్లారు. తన పాత నెంబర్‌కు బదులుగా కొత్తగా మరో నెంబర్‌ను ఖాతాతో లింకు చేయాల్సిందిగా అందులో కోరారు. అయితే బ్యాంకు నిబంధనల ప్రకారం వినియోగదారుడు స్వయంగా వచ్చి, నిర్ణీత దరఖాస్తు పూరించి ఇస్తేనే ఈ మార్పిడి సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులు ఎన్‌ఆర్‌ఐకి సమాచారం ఇచ్చారు. ఆపై ఆమె ఆ విషయం మర్చిపోయారు.

ఎడాపెడా వాడేసిన నిందితుడు...
సెల్‌ఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల నిబంధనల ప్రకారం ఏదైనా ప్రీ–పెయిడ్‌ నెంబర్‌ను వినియోగదారుడు కొన్నాళ్ల పాటు వినియోగించకుంటే దాన్ని వేరే వినియోగదారుడికి ఎలాట్‌ చేసేస్తారు. దీని ప్రకారమే ఎన్‌ఆర్‌ఐకి చెందిన ‘రిజిస్టర్డ్‌ నెంబర్‌’ను సర్వీస్‌ ప్రొవైడర్‌ నాలుగు నెలల క్రితం మరో వ్యక్తికి కేటాయించారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొన్ని ఆర్థిక లావాదేవీల యాప్స్‌లో ఓ లోపం ఉంది. బ్యాంకు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌తో ఉన్న ఫోన్‌లో వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ ఖాతాను యాక్సస్‌ చేసే అవకాశం ఉంది. దీంతో ఎన్‌ఆర్‌ఐ నెంబర్‌ పొందిన యువకుడు తన సెల్‌ఫోన్‌లో కొన్ని ఈ తరహా యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో ఆమె బ్యాంకు ఖాతాతో అనుసంధానమైంది. లావాదేవీలకు సంబంధించిన అలర్ట్స్, ఓటీపీలు సైతం ఇదే నెంబర్‌కు రావడం అతడికి కలిసి వచ్చింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న అతగాడు ఎన్‌ఆర్‌ఐ ఖాతాలో ఉన్న నగదును తన ఖాతాలోకి మళ్లించాడు.మూడునెలల్లో రూ.7లక్షలు స్వాహా చేశాడు. 

రంగంలోకి దిగిన సైబర్‌ కాప్స్‌...
ఈ వ్యవహారంపై విదేశాల్లో ఉన్న యువతికి సమాచారం రాకపోవడంతో ఆమె తన ఖాతాలోకి నగదు జమ చేస్తూనే ఉన్నారు. ఈ మొత్తాన్ని ఓ వ్యక్తి కాజేస్తున్నాడనే అంశమే ఆమె దృష్టికి వెళ్లలేదు. ఇటీవల ఆమె తండ్రి సదరు బ్యాంకు ఖాతాను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అందులో ఉండాల్సిన మొత్తం లేనట్లు గుర్తించారు. లెక్కలు చూడగా దాదాపు రూ.7 లక్షల వరకు తేడా రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ బి.మధుసూదన్‌ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి సదరు యువకుడు ఏపీలోని చిత్తూరుకు చెందిన వాడిగా భావిస్తున్నారు. సెల్‌ఫోన్‌ నెంబర్‌తో పాటు బ్యాంకు ఖాతా వివరాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు