కూతురిని చంపి.. తల్లి ఆత్మహత్య

9 Apr, 2019 20:48 IST|Sakshi
పాలెం గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్న పోలీసులు

ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న గ్రామస్తులు

రెండేళ్ల కిందట బ్రెయిన్‌స్ట్రోక్‌తో భర్త మృతి..

పాలెంలో విషాదం

కొత్తకోట రూరల్‌: బ్రెయిన్‌ స్ట్రోక్‌తో భర్త మరణం.. చుట్టిముట్టిన ఆర్థిక ఇబ్బందులు.. వెరసి ఓ తల్లి తన కూతురికి కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన మండలంలోని పాలెంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూర్‌ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన జానకమ్మ, సవరయ్య దంపతుల కూతురు నిర్మల(30)ని పాలెం గ్రామానికి చెందిన నర్సింహకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి కూతురు సింధూ(8) ఉంది. అయితే, రెండేళ్ల కిందట భర్త నర్సింహ బ్రేన్‌ స్ట్రోక్‌తో చనిపోయాడు. అప్పటి నుంచి నిర్మల, ఆమె కూతురు ఇద్దరూ తల్లిగారి ఊరు ఆరేపల్లిలో ఉంటున్నారు. అయితే, ఉగాది పండుగ కావడంతో అత్తగారి ఊరైన పాలెంకు వచ్చారు.

కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపి..

ఏమైందో తెలియదు కానీ, ఆదివారం రాత్రి పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలిపి మొదట కూతురు సింధూకు ఇచ్చి, అనంతరం తల్లి నిర్మల తాగి ఇంట్లోనే నిద్రించారు. రాత్రి 10గంటల సమయంలో కూతురు సింధూ కడుపునొప్పిగా ఉందని చెప్పగా.. ఏంకాదులే ఉదయం ఆస్పత్రికి వెళ్దామని చెప్పి తల్లి నిద్రపుచ్చింది. అనంతరం గాడనిద్రలో ఉన్న పాప మృతిచెందిందో లేదోనన్న అనుమానంతో తల్లి కత్తితో రెండు సార్లు పొడిచినట్లు గాట్లు కూడా ఉన్నాయి.

తెల్లవారుజామున 4గంటల సమయంలో నిర్మల అత్త సవరమ్మ లేచి చూసేసరికి మంచంపై సింధూ ఒక్కతే కనపడడంతో నిర్మల ఎక్కడ ఉందోనని బయటికి వచ్చి చూసింది. అప్పటికే నిర్మల అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. గ్రామస్తులు మొదట నిర్మలను ఆటోలో ఎక్కించుకుంటుండగా.. నిద్రలో ఉన్న సింధూ లేస్తే తల్లికోసం ఏడుస్తదేమోనన్న ఉద్దేశంతో తనను లేపేందుకు వెళ్లి చూడగా సింధూ అప్పటికే మృతిచెంది ఉంది.

వెంటనే తల్లి కూతుళ్లను ఆటోలో వనపర్తి ఆస్పత్రికి తరలిస్తుండగా తల్లి నిర్మల కూడా మార్గమధ్యంలోనే మృతిచెందిందని గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐ రవికాంత్‌రావు గ్రామస్తులతో ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకొని క్లూస్‌ టీం ద్వారా వివరాలు సేకరించారు. ఇదిలాఉండగా, భర్త చనిపోయాక నిర్మలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండేవని గ్రామస్తులు పేర్కొన్నారు. బాధితురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. 

మరిన్ని వార్తలు