హత్య.. హైడ్రామా..!  

4 Apr, 2018 12:36 IST|Sakshi

వ్యక్తిని చంపినట్లు చిత్రీకరణ

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన   

మహబూబ్‌నగర్‌ క్రైం: సినిమా స్థాయిలో హత్య డ్రామా నడిచింది.. ఓ వ్యక్తిపై కుంకుమ కలిపిన నీటిని పోసి.. అతనిని హత్య చేయకపోయినా చేసినట్లు చిత్రీకరించి సుపారి ఇచ్చిన వ్యక్తికి ఫొటోలు తీసి వాట్సాప్‌ ద్వారా పంపించి నమ్మించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రూరల్‌ ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా.. మూసాపేట మండలం పొల్కంపల్లికి చెందిన పుట్ట చెన్నయ్య ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ పట్టణంలోని పద్మవతికాలనీలో నివాసం ఉంటున్నాడు.

అయితే పొల్కంపల్లి గ్రామ సర్పంచ్‌ యాదయ్యకు పుట్ట యాదయ్యకు గ్రామంలో భూమి గొడవలు జరుగుతున్నాయి. ఇదే కేసుల విషయంలో మార్చి 24న జిల్లా కోర్టుకు హాజరయ్యేందుకు యాదయ్య, పుట్ట చెన్నయ్య ఇద్దరు వచ్చారు. ఆ సమయంలో యాదయ్య ఇద్దరు కొత్త వ్యక్తులకు పుట్ట చెన్నయ్యను చూపించాడు.

ఆ విషయంపై అనుమానం వచ్చిన చెన్నయ్య అతని మామ కొడుకు అయిన ఆంజనేయులును పిలిచి ఆ కొత్త వ్యక్తులను చూపించాడు. దాంట్లో భగీరథకాలనీకి చెందిన అజయ్‌గా గుర్తించాడు. అదేరోజు సాయంత్రం అజయ్‌ పిలిచి ఆంజనేయులు అడిగాడు అప్పుడు అతను పొల్కంపల్లి సర్పంచ్‌ యాదయ్య మీ మామను హత్య చేయాలని మాకు రూ.2లక్షలకు సుపారీ  ఇచ్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆంజనేయులు అజన్‌ను బతిమిలాడగా హత్య చేయనని ఒప్పుకున్నాడు.   
చంపినట్లు చిత్రీకరణ 
అజయ్‌ వారం రోజుల తర్వాత పుట్ట చెన్నయ్యను మహబూబ్‌నగర్‌లో కలిశాడు. సర్పంచ్‌ యాదయ్య నిన్ను చంపమని ఫోన్‌ చేస్తున్నాడని చెప్పాడు. నేను చెప్పినట్లు నవ్వు చేస్తే చావు నుంచి తప్పించుకోవచ్చు అనే సలహా ఇచ్చాడు. దీంతో ఈనెల 1న రాత్రి 7గంటల సమయంలో రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి అజయ్, వరు ణ్, పుట్ట చెన్నయ్య ముగ్గురు  వెళ్లారు. ఆ తర్వాత అజయ్, వరుణ్‌ కలిసి పుట్ట చెన్నయ్యను ఒక రాయి దగ్గర పడ్డుకోబెట్టి అతనిపై కుంకుమ కలిపిన నీటిని చల్లి..హత్య చేసినట్లు చిత్రీకరించారు.

వాటి పుటేజీలను వాట్సాప్‌ ద్వారా యాదయ్యకు పంపించి చెన్నయ్యను హత్యచేసినట్లు తెలిపారు. అనంతరం చెన్నయ్య షాద్‌నగర్‌కు వెళ్లాడు. మంగళవారం ఉదయం చెన్నయ్య హత్యకు గురైనట్లు ప్రచారం జరిగింది. అతని కుటుంబసభ్యులకు సైతం తెలియడంతో వారు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ కు చేరుకున్నారు.

చెన్నయ్య అపుడే ఫోన్‌ చేసి తాను బతికే ఉన్నానని చెప్పాడు. అనంతరం చెన్నయ్య మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పొల్కంపల్లి సర్పంచ్‌ యాదయ్యపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్‌ఐ ఏ–1గా యాదయ్యపై, అజయ్, వరుణ్‌లపై సైతం హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు